బంధం

బంధం

రచన: సావిత్రి తోట “జాహ్నవి”

వివాహం అంటే రెండు మనసుల కలయిక. బరువు, బాధ్యతలు.  ఒకరి కష్టసుఖాలు ఒకరూ పంచుకోని, ఒకరికి ఒకరూ తోడై నిలవడం.

అది రాత్రి పదకొండుగంటల సమయం. మూడేళ్ల పిల్లలకు అన్నం తినిపించేసి, గంట క్రితమే పడుకోబెట్టిన కవిత…
ఇంకా ఇంటికి రాని భర్త కోసం ఎదురు చూస్తూ…
ఈయన ఇంకా రాలేదేంటి!? అస్సలు బయలుదేరారో!? లేదో!? తొందరగా వస్తే బాగున్ను! రేపు ఉగాది. ఉదయం తొందరగా లేచి పూజ చేసుకోవాలి”
అని  ఇంకా ఇంటికి రాని భర్తపై మనసులో విసుక్కుంటూ… వంటగది చక్కబెడుతుండగా…
(ఆ రోజుల్లో ఇంకా ల్యాండ్ లైన్ ఫోన్స్ యే అందరికి అందుబాటులోకి రాలేదు.ఇంకా సెల్ ఫోన్లు ఎక్కడ!?)

“పెళ్లంటే…
పందిళ్ళు…
సందడ్లు…
తప్పెట్లు…
తాళాలు…
తలంబ్రాలు
ఏడే అడుగులు,
మూడేముళ్లు…
మెుత్తం కలిసి నూరేళ్లు…
ఆ…ఆ…ఆ…”

  ఎక్కడి నుంచో పెళ్లి పందిరి నుండి స్పీకర్ లో నుండి పాట వినిపిస్తుంది.

   అలా వింటూ వంటగది అంతా పినాయిల్ వేసి,  శుభ్రంగా కడిగి,  తడిగుడ్డతో తుడిచి,  ముగ్గులు పెట్టేసింది .

   కవితకు పాటలంటే చాలా ఇష్టం.  పాటలు వింటూ పని చేస్తూంటే ఎంత పని అయిన ఇట్టే అయిపోయినట్లు అనిపిస్తుంది. అలా ఆ  అయ్యాక ఇంకో పాట…

 ” జానకి కలగనలేదు…
రాముడు పతిగా…
కాగలడని ఆనాడు…
ఆనాడు ఎవరూ అనుకోనిది…
ఈనాడు మనకు నిజమైనది…
ఆ రామాయణమూ…
మన జీవన పారాయణం…”

     అలా ఒకదాని తర్వాత ఒకటి పాటలు వస్తుంటే పాడుకుంటూ… మొత్తానికి  తన పని ఎలాగో  పూర్తి చేసుకుంది.

     ఇంతలో ఎవరో పిలిచినట్లు అయితే బయటకి వచ్చి చూసింది.

    ఎవరో 20 ఏళ్ల అబ్బాయి తనని చూసి “కవిత అంటే మీరేనా,మీ వారి పేరు కరుణాకర్ కదూ” అంటూ అంత రాత్రి వేళ ముక్కుముఖం తెలియని ఎవరో వ్యక్తి ఇంటికి వచ్చి, అడుగుతుంటే అంతా అయోమయంగా అనిపించి…

      ” అవును. మీరేవరూ? మావారు మీకేలా తెలుసు? ఆయన ఇంకా ఇంటికి రాలేదు. వచ్చే టైం అయింది. ఆయనతో మీకేం  పని?” అంటూ… గుమ్మంలోనే నిలబెట్టి, సాధ్యమైనంత దూరంగా ఉంటూనే  ప్రశ్నల వర్షం కురిపించింది.

        “అగండాంగండి, నేను అదే చెప్పబోతున్నాను. మీ వారికి దగ్గరలో రోడ్డు మీద ఆక్సిడెంట్ జరిగింది. ఎవరైనా ఉంటే నాతో పంపించండి. మా ఇల్లు  ఇక్కడికి దగ్గరే.  మా ఇంటి పక్కనే డాక్టర్ గారు ఉన్నారు. మీ వారిని అక్కడికి తీసుకెళ్లాం. ఈ విషయం మీకు చెప్పి, ఎవరినైనను ఆయనకు తోడుగా తీసుకెళ్లాలని వచ్చాను. “అని చెప్తున్న అతని మాటలు వింటూనే కూలబడిపోయింది కవిత.

        ఆ పక్కనే ఉన్న కవిత తమ్ముడు ఇంటికి ఎవరో కొత్త వాళ్లు రావడం చూసి ఎవరూ!?ఏంటాని!? వచ్చి, చూసి, విషయం అన్ని సరిగ్గా కనుక్కోని, అతను చెప్తుంది నిజమని నమ్మి,   అక్కకి దైర్యం చెప్పి, అతని వెంట వెళ్లాడు.

      అలా ఆ అపరిచిత వ్యక్తి  వెంట వెళ్లిన మధుసూదన్,  కరుణాకర్  కాలుకి సిమెంట్ కట్టు తో బ్యాండేజ్ వేయించి, ఇంటికి తీసుకుని వచ్చేసరికి అర్థరాత్రి మూడు గంటలు అయింది .
అంతవరకు ఆ ఇంట్లో ఇద్దరు పసివాళ్లను పెట్టుకుని, ‘ఎటువంటి వార్త వినవలసి వస్తుందోనని’  ఒంటరిగా బిక్కుబిక్కుమంటూనే ఉంది కవిత‌.

     కరుణాకర్ అమ్మ నాన్న వేరే ఊరిలో ఉండడం వలన ఆ సమయానికి వాళ్లనుండి ఎటువంటి సాయం కాని, ఓదార్పు కాని, అందలేదు.

    ఆ తర్వాత ఎవరో పరాయివాళ్ల  మాదిరి పరామర్శకు మామగారితో  వచ్చిన అత్తగారు, ఒక రోజు ఉండి, తిరిగి వెళ్లిపోతూ… “ఇంకా ఇక్కడే  ఉండటానికి మాకు కుదరదు. నువ్వే దగ్గర ఉండి తన బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసుకుంటావనే, ఒకరి చేతుల్లో ఒకరి చెయ్యి వేసి, మీ ఇద్దరికి పెళ్లి చేసాము. అందుకే ఇంక ఏమైనా కరుణాకర్ బాధ్యత నీదే. మాకు ఏ సంబంధం లేదని” చెప్పడం వలన రాత్రి పగలు కరుణాకర్ బాధ్యత అంతా కవిత ఒకర్తె చూసుకుంది.

       ఆ కట్టు 21 రోజులు ఉండాలని డాక్టర్లు చెప్పడంతో కరుణాకర్ కి అన్ని రకాలు సేవలు చేస్తూ, కాళ్లు కదలనివ్వకుండా, సమయానికి మందులు వేస్తూ కంటికి రెప్పలా కాపాడుతుంది.

       అటు ఇద్దరు పసిపిల్లలతోను, కరుణాకర్ కి సమయానికి ఆహారం మందులు అందిస్తూ.. కుడి చెయ్యి, ఎడమ చెయ్యి అన్న బేధం లేకుండా సేవలు చేయడంలో  పడి,  నిద్రాహారాలు మరిచిపోయి, బాగా నీరసపడిపోయింది.

     ఆ తరువాత హాస్పిటల్ కి చెకప్ కి తీసుకెళ్లినపుడు…  సరిగా తిండి, నిద్ర లేకపోవడం వలన కళ్లు తిరిగి పడిపోవడం అక్కడే ఉన్న డాక్టర్ చూసి, కవితకు కూడా ట్రీట్మెంట్ చేసి, దైర్యం చెప్పి, ఇద్దరిని తిరిగి ఇంటికి పంపించారు.

     సమయానికి అన్ని కాళ్ల దగ్గరకు అమరుతున్నప్పటికి ,ఏమి తోచడం లేదంటూ… సరిగా ఉండకా.. అటు ఇటు తిరగుతూ… కాళ్లు కదిపేయడం వలన 21 రోజులు అనుకున్నది రెండు నెలల వరకు ఎముకలు అతుక్కోక అటు ఇంటి బాధ్యతలను, కరుణాకర్ బాధ్యత కూడా కవిత ఒకర్తె చూసుకుంటూ  రాత్రి పగలు సేవ చేయడం వలన తిరిగి కరుణాకర్ మామూలు మనిషయ్యాడు.

       ఇదే కదా వివాహ బంధం లోని గొప్ప విషయం. భార్యభర్తలంటే అన్ని సవ్యంగా ఉన్నపుడే కాక ఒకరికి ఏదైనా కష్టం వచ్చినపుడే అసలైన వివాహబంధానికి అర్ధం తెలిసేది ఎవరికైనా!…

      కాని ఈ కాలంలో అలా ఎంత మంది చూస్తున్నారు.

     ఒకరికి ఏదైనా కష్టం వస్తే హాస్పిటల్ లో జాయిన్ చేసి చేతులు దులుపేసుకుంటున్న వారిని చాలా మంది భర్తలని చూస్తుంటాం.

ఎంత బాధకరమైన విషయం. సాధారణంగా భార్యలు భర్తలకు ఏ చిన్న కష్టం వచ్చిన తట్టుకోలేరు.దగ్గర ఉండి అన్ని సేవలు చేస్తూ, ఆ భర్త మరల మాములు మనిషి అయ్యేవరకు తిండి, నిద్ర మానేస్తారు.

     కాని అదే భార్యకి ఏ కష్టమైన వస్తే పుట్టింటికి పంపేస్తారు. లేదంటే ఎంత కష్టమైన తానకు తానే పడాలి. కనీసం తాగావా , తిన్నావా అని అడిగేవారు ఎంత మంది ఉన్నారు.

    అలా భార్య  కష్టాలలో పాలుపంచుకుని, జాగ్రత్తగా చూసుకునే భర్తలకు, భార్యలకు శతకోటి వందనాలు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!