ప్రాణం తీసిన ఎన్నికలు

ప్రాణం తీసిన ఎన్నికలు

రచన: అయ్యలసోమయాజుల ప్రసాద్

ఎన్నికలొచ్చాయి మళ్ళీ ఎన్నికలొచ్చాయి. పండగే పండుగ. చీమిడిముక్కు ,బోడిగుండుతో ఉన్న లచ్చిమిని ఎత్తుకొని పై మీదున్న కండువాతో చీమిడిని తుడిచి బంగారుతల్లి ఎంత అందంగా ఉన్నదో అని ఓట్లు దండుకోడానికి వచ్చిన నాయకుడు అన్న మాటలు విని అప్పలకొండ మురిసిపోయింది. దానికేం తెలుసు అదంతా కపటనాటకం అని,మీ ఇంట్లో నలుగురికి నాలుగువేలరూపాయలు మా వెంకడు ఇస్తాడు. రెండు రోజులు పార్టీ జెండా పట్టుకుని మా వెంట వస్తే మనిషికి మూడొందలు,తినడానికి బిర్యానీ ప్యాకెట్టు అన్నప్పుడు ఎంత మంచివాడో ఈ మహారాజు అని పొంగి పోయింది.

ఏటేటి వెయ్యిరూపాయిలా చూడు పలానా పార్టీవాళ్ళు రాత్రి వచ్చి మనిషికి రెండువేల చొప్పున ఇస్తారట అవికూడా పుచ్చుకుందాం అని పక్కింటి బంగారి అంది. ఆ మాట వినగానే మొగుడి సూరిగాడి తాగుడికిపోను చాలా మిగుల్తాది. ఈ నెల కష్టపడక్కరలేదు అని అనుకుంది అప్పలకొండ. ఒసే బంగారి ఆడ ఎలక్షన్ చీటి ముక్క చూపిస్తే సెల్ ఫోన్ ఇస్తున్నారట అవి కూడ తీసుకుందాం అంది అప్పలకొండ. ఎలాగైతేనేమి ఒక్కరోజులోనే పదివేల రూపాయలు, సెల్ ఫోనులను సంపాదించుకొంది.

ఎలక్షన్ తేదీరానే వచ్చింది. మొత్తం మీద ఓట్ల సందడి పూర్తి అయింది. ఎప్పడు తెలుస్తాది ఎవడొచ్చిండో అని భర్తనడిగితే ఒకటిన్నర నెలల తరువాత ఫలితాలు వస్తాయి, అయినా ఎవరొచ్చినా మనకేటి అని సూరిగాడు భార్యతో అన్నాడు. వారం రోజుల్లో పనికిపోక మొగుడు పూర్తిగా రెండు పూటలా తాగి అడిగితే పెళ్ళాన్ని చితకబాది పదివేలు ,పదిపైసల్లా ఖర్చు పెట్టడంచూసి, ఎవరొచ్చినా మా బ్రతుకులింతే అని అప్పలకొండ సర్దుకుపోయింది.

ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు రాత్రి ఏడుగంటలపుడు సూరిగాడికి పనిఇచ్చే నాయిడు గారి వడ్డిడబ్బులు ప్రతినెలా వసూలు చేసే మస్తాన్ గాడు అప్పలకొండ దగ్గరకొచ్చి ఎక్కడ నీ మొగుడు అని అడిగితే, అదిగో ఆ మూల వసారాలో తాగి తొంగున్నాడు చచ్చినోడు అంది. వెంటనే మస్తాన్ ఏరా సూరిగా మేము డబ్బులిస్తే మా ఆపొజిషన్ వాళ్ళకి ఓట్లువేసి గెలిపించినారా కొడకల్లారా అని బూతులు తిడుతు మూల పడుకున్న సూరిగాడిని కాలితో తన్నాడు. వెంటనే వాడికి పౌరుషం వచ్చి ఉగ్రరూపం దాల్చి నన్నే తంతావురా నా కొడకా అంటూ తూలుతు, తిడుతు మస్తాన్ పైకి వచ్చాడు.

సూరిగాడి గుండెలపై వెంటనే మస్తాన్ గట్టిగా కాలితో తన్నేసరికి వాడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఈ లోపున అప్పలకొండ ఓరి దేముడా, దిక్కుమాలిన ఎన్నికలొచ్చి నా పెనిమిటి ప్రాణాలను తీసుకుపోయాయి, మా కెవ్వరు దిక్కు అని భోరున ఏడుస్తూ భర్త శవం పై పడి, భర్తతో పాటు తిరిగిరాని లోకాలకు పిల్లల్ని అనాథలను చేసి వెళ్ళిపోయింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!