చిన్న విషయం

చిన్న విషయం

రచయిత :: మంగు కృష్ణకుమారి

ఆదెమ్మగారు తిరగట్లో బియ్యం పోసి విసురుతోంది. పెరటి అరుగుమీదవకూచొని విసురుతోందేమో, చెట్టుమీదనించీ కాకులు ‘కాకా’ అని గోల చేస్తున్నాయి.

చేటతో బియ్యం తెస్తూ లలిత విసుగు మొహంతో, “మీ చాదస్తం గానీ, ఈ రోజుల్లో ఎవరూ ఇలా తిరగట్లో విసురుకోరండీ! లక్షణంగా మిల్లుకి పంపితే అరగంటలొ పిండి వచ్చేస్తుంది.” అంది.

“ఒసే, నేను విసురుతున్నది. దేవుడి ప్రసాదానికి. ఉండ్రాళ్ళు పోస్తానని, చలిమిడి ప్రసాదం చల్లనయ్య చంద్రుడికి పెట్టి కటికోపాసం చేస్తానని మొక్కేను. కల్తీ మిల్లు పిండితో ఎలా చెయ్యమంటావే?” ఆదెమ్మ‌ కూడా గట్టిగా అంది.

“అసలు మొక్కు దేనికత్తయ్యా?” లలిత.
“అదేనే మన చంద్రానికి మంచి ఉద్యోగం రావాలని మొక్కేను” ఆదెమ్మగారు చెప్తుంటే “ఎట్టెట్టా? ఇప్పుడు దానికోసం మీరు కటిక ఉపోసం చేస్తారా? మీ అబ్బాయి ఊరినించీ రాగానే నన్ను బాగా తిడతారు” బుగ్గన వేలేసుకుంది లలిత.

“మధ్యలో నిన్ను తిట్టడం దేనికి? వాడికి నేను భయపడాలా? నాకు వాడు భయపడాలా?” చారెడు బియ్యం తిరగట్లో‌‌పోసి ధనా ధనా విసురుతూ అంది ఆదెమ్మ.

లలిత కింద పడ్డ పిండిని జల్లించడం మొదలెట్టింది.

“చంటినాగన్న ఓ బెంగ పెట్టేసుకుంటున్నాడు ఉద్యోగం గురించి” ఆదెమ్మ అంటుంటే ఓ‌ కాకి ఎగిరివచ్చి మళ్ళా కాకా అంటూ వెనక్కి వెళ్ళింది.

“నాలుగు గింజలు‌ దూరంగా వేసీవే! పిచ్చి కాకులు పాపం ఆకలో ఏమో తెగ అరుస్తున్నాయి” విసరడం ఆపకుండానే అంది ఆదెమ్మ.

గాలి దుమారంలాగే వచ్చేడు చంద్రం.
“బామ్మా, నా పెన్ను అన్నయ్య తీసుకెళిపోయేడు” కందిన మొహంతో అన్నాడు.

“పోనీరా! మీ అమ్మ పెన్ను ఉందిగా, రాసుకోరా!” తేలిగ్గా అంది ఆదెమ్మ.

“అమ్మా, చూడు! బామ్మ, నాపెన్ను అన్నయ్య తీసుకెళ్ళేడంటే ఎలా తీసిపడేస్తోందో, నేనంటే ఎవరికీ లక్ష్యం లేదు” కోపంతొ అన్నాడు చంద్రం.

లలిత అనునయంగా “నీకు చెప్పేడట్రా” అంది. “లేదు. నన్ను అడిగితే ఇవ్వనేమో అని, చూడకుండా పట్టుకెళిపోయేడు” కసిగా అన్నాడు చంద్రం.

“బాగుందిరా చెందూ, వాడెందుకు అలా చేస్తాడు? అయినా పెన్నే కదురా…. ఏమయింది? వాడేతెస్తాడులే!” ఆదెమ్మ గారి మాటలకి వీరంగం వేసేడు చంద్రం.

బామ్మకి అన్నయ్యంటే‌ ఇష్టం కాబట్టి అలా మాటాడుతోందన్నాడు. తనకి ఉద్యోగం లేదని అన్నకి చిన్నచూపు అన్నాడు. తల్లి అనునయాలు ఏవీ
పనిచేయలేదు. లలిత దేవుడి మీద భారం వేసి పెద్దకొడుకు కేశవ్ ఎప్పుడు వస్తాడా? అని చూస్తోంది.

పిండిపని పూర్తి చేసి తిరగలి కడిగి ఓ మూల ఉంచి, ‘పరమేశ్వరా’ అంటూ లేచింది ఆదెమ్మ.

ఏ మనవడికి ఉద్యోగం రావాలని మొక్కుతోందో ఆ మనవడి చేతే తిట్లు తింటూ ఇంత మజ్జిగ తాగి నడ్డి వాల్చింది.

ఎప్పుడూ లేనిది కేశవ్ ఆలస్యంగా తొమ్మిదికి వచ్చేడు. లలిత ఎంత బతిమాలినా చంద్రం అన్నం తినలేదు.

“అమ్మా ఆకలి స్నానం చేసొస్తాను. వడ్డించీ” కేశవ్ లోపలకి వస్తూ అన్నాడు.

ఆవేశంగా వచ్చేడు చంద్రం. “నా పెన్ను నన్నడగకుండా ఎందుకు తీసుకెళ్ళేవ్?” అన్నాడు‌.
“అవునురా! ఈరోజు ఇనస్పెక్షన్ ఉంది. నా పెన్ను సరిగ్గా రాయటం లేదని నీ పెన్ను తీసుకెళ్ళేను. నువ్వు కనపడలేదు” కేశవ్ అంటూ ఉండగానే
లలిత వచ్చింది. “బాబూ, వాడిపెన్ను మొదట ఇచ్చీరా!” అంటూ! కేశవ్ జేబులు వెతికేడు. “అయ్యో, ఆఫీసులో మర్చిపోయేనమ్మా, రేపు తెస్తాలే” అంతే, చంద్రం చెలరేగిపోయేడు.

తనకి ఉద్యోగం లేదు కాబట్టి అన్న కోరుండి పెన్ను తీసికెళ్ళి ఆఫీస్ లో వదిలేసడని అన్నాడు. పెన్ను అప్పుడే తెచ్చి ఇవ్వాలని గొడవ పెద్ధదిచేసేడు. లేకపొతే ఇంట్లో ఉండనని వార్నింగ్ ఇచ్చేడు. కేశవ్ తమ్ముడి ఆవేదన బోధపరచుకున్నాడు‌‌‌.

స్వతహాగా చంద్రం చాలా మంచిచాడు. సరళ హృదయుడు. బిఎస్సి ఫస్ట్ క్లాస్ లో పాసయేడు. పైచదువులకి కుదరలేదు. ఉద్యోగం కోసం విపరీతంగా ప్రయత్నం చేస్తున్నాడు. రాటం లేదు‌. ఆ నిరాశలో ఏదోదానికి తగువు పెట్టుకుంటున్నాడు‌.

కేశవ్ గబగబా చెప్పులు వేసుకొని వెళ్ళేడు. ఆఫీసర్‌ని బతిమాలి తాళం చెవులు తీసుకొని ప్యూన్ సాయంతో ఆఫీసు తలుపుతీసి,వపెన్ను తీసుకొని మళ్ళా జాగ్రత్తగా అన్ని తాళాలు వేసి, తాళం చెవులు ఆఫీసర్ గారికి అప్పచెప్పి ఇంటికి వచ్చి, పెన్ను తమ్ముడి చేతిలో పెట్టి “సారీరా చందూ, ఇంకెప్పుడూ ఇలా చేయను” అన్నాడు.

చంద్రం తన ప్రవర్తనకి సిగ్గుపడుతూ నిశ్శబ్దంగా నిలబడ్డాడు. తల్లి బలవంతం మీద ఇద్దరూ కాస్త తిని లేచేరు.

ఆదెమ్మ మొక్కు తీర్చుకుంది.

ఆ తరవాత ఆరునెలల్లో చంద్రానికి బేంక్ లో ఉద్యోగం వచ్చింది. ఇంట్లో అందరి కాళ్ళకీ నమస్కరించి మరీ, కొత్త ఉద్యోగంలో జాయిన్ అయేడు.

గోడకి ఉన్న ఫొటోలో ఆదెమ్మ నవ్వుతోంది. “అమ్మా! ఈరోజు బామ్మ పుట్టినదినం కదూ” అని చంద్రం అంటుంటే “అవున్రా, నువ్వంటే ఎంత ఆపేక్షో! అందుకే ఆవిడ నీకోసం చేసినట్టు నేను ఆవిడ పేరుమీద పూజలు చేస్తున్నాను” లలిత నవ్వుతూ చెప్పింది. ఆ రోజుల్లో బామ్మతో తగువులాడ్డం అన్నీ తలపుకి వచ్చి చంద్రం సిగ్గుతో బుర్ర దించుకున్నాడు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!