ఇంకేంటి?! చెప్పు..

ఇంకేంటి?! చెప్పు

 

రచయిత :: పాండురంగాచారి వడ్ల

ఏంటో, సమయం ఎలా గడిచిపోతోందీ తెలియట్లేదు, ఇలా గడియారం వంక రెండో సారి తిరిగి చూసేలోపే గంట కొట్టేస్తోంది. ఉదయాన్నే ఆరింటికి లేచినా ఆఫీసుకు తయారయి బయలుదేరేసరికి తొమ్మిది గంటలు అవుతోంది. పోనీ అంత త్వరగా లేచి నేను పొడిచే పనులు ఏమైనా ఉన్నాయా అంటే అదీ లేదూ, అన్నీ మా ఆవిడేy రెడీ చేసి, నన్ను సాగనంపుతుంది, అయినా రోజూ ఆలస్యమే. ఇంట్లో పెళ్ళాం రుసరుసలు ఆఫీసులో నా మొగుడు (మేనేజరు) చేత చీవాట్లు.
ఇలా అయితే కుదరదు, ఎలా అయినా ఇంకాస్త తొందరగా లేస్తేనే త్వరగా బయల్దేరి వెళ్లిపోవచ్చని ఓ రోజు అయిదింటికే లేచి కూర్చున్నాను. “అసలు ఎందుకని సమయం అంత త్వరగా గడిచిపోతోంది?” కారణం తెలుసుకునే పనిలో పడి, రోజూ కన్నా  ఇంకో పది నిమిషాలు ఎక్కువ ఆలస్యమే అయ్యింది.

బస్ స్టాప్ కి వెళ్ళేసరికే సుమారు పాతిక ముప్పై మంది జనాలు, రోజు కంటే ఓ డజను ఎక్కువే ఉన్నారు ఈ రోజు.
బస్సు వచ్చింది తాబేలు కన్నా నెమ్మదిగా, లోపల ఉన్నవారికి ఊపిరి కూడా ఆడనంత నిండుగా. ఊర్లో జనాలంతా బస్సులోనే ఉన్నట్టున్నారు అనిపించింది నాకైతే.

ఉస్సెన్ బోల్ట్ కూడా అంత వేగంగా పరిగెత్తలేడేమో, అంత కంటే వేగంగా  ఓ పదిమంది పరిగెత్తారు బస్సు ఎక్కడానికి. అందరూ ఎక్కాక, ఎలాగో నానా తంటాలు పడి, బస్సు తలుపుకి కిటికీకి మధ్యలో ఉన్న రాడ్ పట్టుకుని, ఫుట్ పాత్ మీద కాలు పెట్టేసి, వేలాడుతున్నట్టుగా నిల్చున్నాను.

తరువాత స్టాప్ లో అయినా కొద్ది మంది జనాలు బస్సు దిగిపోతే బాగుండు, కనీసం కొంత లోపలికి వెళ్లి కాస్త సర్దుకుని నిల్చునే అవకాశం ఉంటుంది అని అనుకుంటూ బస్సులోకి రోడ్డు మీదకు చూస్తూ కిందా పైనా దిక్కులు చూస్తూ ఉన్నాను. చిరుగులతో అతుకులతో ఉన్న బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్, రంగురంగుల ఇంగ్లీషు అక్షరాలతో తెలుపు రంగు టీ షర్ట్ తో నా పక్కన ఉన్న ఒక కుర్రాడి మీద నా చూపులు నిలిచి పోయాయి. ఒక కాలు నేను నిల్చున్న మెట్టు మీద, ఇంకో కాలు పైన మెట్టు మీద పెట్టి చెవులకి యియర్ ఫోన్స్ పెట్టుకుని ఫోన్లో మాట్లాడుతూన్నాడు. అవతల వైపు అమ్మాయి అనుకుంటా, తెగ సిగ్గు పడుతూన్నాడు మధ్య మధ్యలో. అతడు ఉన్న ఈ పరిస్థితుల్లో కూడా మాట్లాడడం అవసరమా అనిపించింది, నాకు ఆఫీసుకు ఆలస్యం అయిపోతోంది అన్న చిరాకు వల్ల కావచ్చు. బస్సు లోపల ఖాళీ లేక, లోపలి వాళ్ళు మెట్ల పైన ఉన్న వాళ్ళ మీద పడిపోతున్నారు, ఇంచుమించు ఆ అబ్బాయి కూడా నా మీద వాలిపోయి మాట్లాడుతున్నాడు. ఆ అబ్బాయి మాటలు నా చెవిలో మాట్లాడుతున్నట్టే ఉంది నాకు.

“నిన్ను చూడకుండా అసలు ఈ పదిహేను గంటలు ఎంత భారంగా గడిచాయో తెలుసా?”

“…….”

“అప్పటికీ రాత్రంతా నీతో ఫోన్లో మాట్లాడుతున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను పిచ్చోడిని అయ్యేవాడిని ఏమో.. నువ్వు కనపడకా.. నీ గొంతు వినకా..”

“……”.

“వచ్చేస్తున్నాగా.. ఇంకో పది నిమిషాల్లో నీ ముందు ఉంటా..”

“…….”

“ఇంకా..”

“…..”

“చెప్పు..”

“…..”

“నువ్వే చెప్పు”

“……….”

“అలాగే..”

“……..”

“ఇంకా….”..

“చెప్పు…”

“చెప్పూ…”

“……..”

ఆ అబ్బాయి దిగే స్టేజ్ వచ్చింది అనుకుంటా, దిగడానికి ప్రయత్నం చేస్తూ లోపల ఉన్న వాళ్ళ మధ్య చిక్కుకున్న బ్యాగ్ ని బయటకు లాక్కుంటూ కూడా ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు..

“చెప్పు..”

“చెప్పు..”

ఇందాకటి సిగ్గు స్థానంలో ఆ అబ్బాయికి చిరాకు కోపం వచ్చేస్తున్నాయి, బస్సు మెల్లిగా కదలడం స్టార్ట్ అయ్యింది.
ఆ అబ్బాయి ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడేమో.. చెవులకి ఇయర్ ఫోన్స్ అలాగే ఉన్నాయి.
ఆ అబ్బాయి దిగడానికి ప్రయత్నిస్తూనే “చెప్పు.. చెప్పు.. ” అంటున్నాడు. బస్సు బయల్దేరిపోతోంది, ఆ అబ్బాయి దిగలేకపోతున్నాడు. అతనికి కోపం తారాస్థాయికి చేరుతుంది అన్నదానికి సూచనగా గట్టిగా అరిచి మాట్లాడుతున్నాడు “చెప్పు… చెప్పు…” అని.

నాక్కూడా చెడ్డ కోపం వచ్చేసింది, నా చెవుల్లో అలా గట్టిగా అరిచేసరికి. నేనూ అరిచేశాను “చెవులు పోతున్నాయి రా బాబూ.. ముందు నా చెవిలో అరవడం ఆపు.. ఓ.. ఊరికే.. చెప్పు చెప్పు అని నస.. చెవిలో జోరీగ లాగా..”

ఆ మాటకి వాడు నన్ను కొట్టడం ఒక్కటే తక్కువ. ఒక అసహ్యపు చూపు ఒకటి విసిరి, “నా చెప్పు…” అన్నాడు ఆవేశంగా నా కాళ్ళ  వైపు చూపిస్తూ.

అప్పుడు వెలిగింది నాకు ఆ అబ్బాయి “చెప్పు” అని అంటోంది ఫోన్లో కాదు, నా కాలు కింద నలిగిపోతూన్న అతని చెప్పు గురించి అని. వెంటనే నా కాలు తీశాను, ఆ అబ్బాయి బస్సు కదులుతుండగానే దిగేసాడు నన్ను తిట్టుకుంటూ.

***

You May Also Like

4 thoughts on “ఇంకేంటి?! చెప్పు..

  1. ఇది హాస్యకథ అని చివరి వరకు తెలియకుండా కథ నడిపి చదువరి కి చివర లో పులకరింపజేశారు. చాలా బాగుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!