సామాజిక న్యాయం…??

సామాజిక న్యాయం…??

 

రచయిత :: లోడె రాములు

ప్రొద్దున్నే మావూరి బస్సెక్కి పట్నంలో ఉన్నపిల్లల్ని,మనవరాళ్లను చూసివద్దామని బయల్దేరాను..
యల్ బి నగర్ రాగానే తెల్లారింది..
బస్ దిగి ఆటో డ్రైవర్ తో బేరమాడుతూ ఉంటే ,వెనక నుండి ఎవరో బాగా తెలిసిన గొంతు..
“ఒరే రాముడూ” అని ..వెనుతిరిగి చూసేసరికి ,రాజారెడ్డి ..
తనది మాఊరే చిన్ననాటి దోస్తులం..కలిసి ఇంటర్ వరకు చదువుకున్నాం..
తాను డిగ్రీ కోసం పట్నం వచ్చేశాడు.
ఆ తర్వాత భూదందాలు చేసి ,
అప్పుడప్పుడు నష్టాల బారిన పడ్డా ఇల్లు నిలదొక్కుకున్నాడు..చిన్నప్పటి నుండి చలాకీగా, అందరితో కలుపుగోలుగా,ఏ దావత్ కు చెప్పినా ,ఎలాంటి భేషజాలు లేకుండా అన్ని సామాజిక వర్గాలతో కలిసిపోవడం..తనకు చేతనైనంత వరకు సహాయం..సేవా కార్యక్రమాలు ముందుండి చేసేవాడు..తనకు నేనంటే వల్లమాలిన ప్రేమ..నా క్షేమసమాచారాన్ని అప్పుడప్పుడు అడుగుతూ..పట్నం వచ్చినప్పుడు కలువురా..ఎప్పుడూ వ్యవసాయ పనులేనా..అని,భుజం మీద చేయివేసి దగ్గరకు తీసుకొంటుంటే నేనే కాస్త బిడియంగా ఉండేవాడిని.అరే మనుషులమంతా ఒక్కటే అని ,మరింత బిగ్గరగా హత్తుకొని సంతోషపరిచేవాడు..తాను డిగ్రీలో ఉన్నప్పుడే బస్ ప్రయణంలోనే ,తన జూనియర్ అమ్మాయిని ప్రేమించాడు..డిగ్రీ అయిపోయాక ఆ అమ్మాయినే పెళ్లిచేసుకుంటానని కచ్చితంగా ఇంట్లో చెబితే ..వాళ్ల నాన్న ఒప్పుకోలేదు… అలాగే ఆ అమ్మాయి వాళ్ల అమ్మా నాన్న ఒప్పుకోలేదు..ఇద్దరి సామాజిక వర్గాలు వేరు..అయినా వారి ప్రేమలో నిజాయితీ ఉందని గ్రహించిన స్నేహితులు, బ్రహ్మసమాజం లో దండలు మార్పించారు..ఆ తర్వాత కొన్నాళ్ళకు అంతా సర్దుకుంది..ఇద్దరు బాబులు.మంచిగా చదువుకొని సాఫ్ట్ వెర్ కంపెనీలలో స్థిరపడ్డారు. గత రెండు సంవత్సరాల క్రితమే, ఆ ఇద్దరు బాబులు వేరు వేరు సామాజిక వర్గాల అమ్మాయిల్నే ప్రేమించి..పెద్దల్ని ఒప్పించి ఘనంగా పెళ్లిల్లు చేసుకున్నారు… ప్రతి కార్యానికి నన్ను పిలవకుండా ఉండడు.తన ఆలోచనల్లో ఉండగానే ,…
తాను వచ్చి భుజం మీద సరుస్తూ..”ఎందబ్బా..చెప్పా పెట్టకుండా ఊడి పడ్డావ్..”
“పిల్లలూ.. మనవరాళ్లు.. బాగున్నారా..!”అంటూ ప్రశ్నల వర్షo. “అంతా బాగున్నాం రాజా.. పిల్లల్ని చూసి రమ్మని మా ఆవిడ గోల..అందుకే ఇట్లా పొద్దున్నే వచ్చిన.. సాయంకాలం తిరిగి వెల్దామని..”
“సరే..కానీ చెప్పడం మరిచాను.. నెల క్రితం నాకూ ఇద్దరు మనవళ్లు వచ్చారు..”అని సంతోషంగా చెప్పాడు..నాకూ ఆనందం కలిగింది..పదా .!.టిఫిన్ చేస్తూ మాటాడుకుందాం ..ఊరి కబుర్లు..
అని హోటల్ ల్లో టిఫిన్ తిని టీ..తాగి నన్ను దగ్గరుండి ఆటో ఎక్కిస్తూ..
” అరే.. మరిచాను ఈ సారి వచ్చినప్పుడు ఇంటికి రావాలి ,
మా మనవoడ్లను చూడాలి..కదా..
అన్నట్టు వాళ్ల పేర్లు..
పెద్దోడి కొడుకు పేరు..ఆకాష్ రెడ్డి..
చిన్నోడి కొడుకు పేరు..అవినాష్ రెడ్డి….”
అంటూ చెబుతుండగానే ఆటో కదిలింది.. మా బిడ్డల ఇండ్లు దగ్గర దగ్గరే రెండు కాలనీలు ..సాయంత్రం దాకా పిల్లలతో గడిపి..మా ఊరి లాస్ట్ బస్ ఎక్కి,హయత్ నగర్ దాటాక రోడ్డు రద్దీ తగ్గి ,బస్ ప్రశాంతంగా నడుస్తుంది..మళ్ళీ ఒక్కసారి రాజా రెడ్డి యాది కొచ్చిండు.తనకు విద్యార్థి దశలో వామపక్ష భావాలు ఉండేవి..అప్పట్లో అందరికీ ఎర్రజెండా అంటే ప్రేమ..ఆకర్షణ..ఉడుకు రక్తంలో సహజంగానే ,తిరుబాటు తత్వం.
జీవితంలో.. ఆటుపోట్లు..సమస్యల ను తట్టుకోవడంలో సర్దుబాటు తత్వం అలవడి పోవడం సహజమే. పొద్దున రాజారెడ్డి తన మనవళ్ల పేర్లు చెప్పినప్పుడు హడావిడిలో ఆలోచన రాలేదు ..ఇప్పుడొస్తుంది,తనది కులాంతర వివాహం..తన పిల్లలకూ కులాంతర వివాహాలు..నిజానికి ఇప్పుడు తన కుటుంబాన్ని పలానా సామాజిక వర్గం అని అనలేం.. తాను కులాతీతుడు..మానవకులం
మతం..మానవత్వం..అభినందించదగ్గ పరిణామం..ఇలాగే ఎదగాలి మనిషి…మనీషి గా..కానీ మళ్ళీ చివరగా తన మనవళ్లకు ఆ పేర్లేమిటి..చివరన పేర్లకు తోకలేమిటి..??. రేపటి ఆ పసివాళ్లకు తాను ఇచ్చే హోదా ఏమిటి..?..ఈ సారి ఊరికి వచ్చినప్పుడు అడగాలి..కడగాలి..
పేర్లు మార్చమని..తోకలు కత్తిరించమని చెప్పాలి..
ఓ ఆప్త మిత్రుడిగా…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!