లాస్య

లాస్య

రచయిత :: బండి చందు

మా ఇంటిని ఆనుకోని ఉన్న ఒక చిన్న వీధి. మా వీధి చివర ఒకే ఒక చిల్లర కొట్టు మా వీధి మొత్తానికి అదే ఆధారం. ఆ కొట్టులో మాకు కావలసింది ఉండదు అక్కడ ఉంది మాకు అవసరం రాదు.
ఆ కొట్టు యజమాని రామయ్యకి నాలుగు పదుల వయసు ఉంటుంది. అతని ఒక్కగానొక్క కూతురి పేరు లాస్య. పేరుకు తగ్గట్టే ఎప్పుడూ నవ్వుముఖంతోనే ఎదురవుతుంది కొట్టుకి వెళితే. లాస్య నవ్వులతో ఆ కొట్టు ఎప్పుడూ సందడిగానే ఉంటుంది. చిన్న పాప కాబట్టి తనంటే అందరికీ ఇష్టమే. చిన్న చిన్న సరుకులతో కొట్టును నడుపుతూ కుటుంబాన్ని ఎలాగో నెట్టుకొస్తుండేవాడు రామయ్య. ఊర్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా రామయ్యే ముందు ఉండి తనకు చేతనైన సహాయం చేసేవాడు. అందుకే రామయ్య అంటే ఊర్లో అందరికి అభిమానం.

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! ప్రతి ప్రాణిని పరిక్షిస్తుంది. ఒకరోజు లాస్య కొట్టు ముందు తన స్నేహితులతో ఆడుకుంటుంది. చాలా సేపు ఆడుకుందేమో ఉన్నట్టుండి కింద పడిపోయింది. తనతో ఆడుకుంటున్న స్నేహితులు లాస్యను చూసి భయపడ్డారు. ఎందుకంటే తన నోటినుండి నురగలు వస్తున్నాయి. రామయ్య కొట్టులో నుండి పరుగెత్తుకు వచ్చి కూతురిని చూసి ఏడవడం మొదలెట్టాడు. చుట్టుపక్కల అందరూ పొగయ్యారు. లాస్యను దావాఖానకి తీసుకెళ్లారు. డాక్టర్ లాస్యను పరీక్ష చేసి గుండెకు రంధ్రం పడింది వెంటనే ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ కి దాదాపు రెండు లక్షలు ఖర్చు అవుతుంది లేకపోతే బ్రతకడం కష్టం అని చెప్పాడు. రామయ్య నిల్చున్నచోటే కుప్పకూలాడు. చిల్లర కోట్టుతో కుటుంబాన్ని పోషించుకునే తాను రెండు లక్షలు ఎక్కడి నుండి తీసుకురావాలో అర్థంకాక తనలోనే కుమిలిపోసాగాడు.

రామయ్య చేసేది లేక తనని పోషించే కొట్టు అమ్మలనుకున్నాడు. రామయ్య కష్టం చూసిన ఊరి జనం తమకు రామయ్య చేసిన ఉపకారం గుర్తుకువచ్చి వారికి తోచినంత సహాయం చేసారు. అయినా డాక్టర్ చెప్పిన రెండు లక్షలు సమకూరలేదు. అదే వీధిలోని లాస్య స్నేహితురాలైన రిషిత వాళ్ళ నాన్న రామయ్యతో మీరు ఆ కొట్టు అమ్మవద్దు నేను దానిని తాకట్టు పెట్టుకొని లాస్యకి ఆపరేషన్ చేయిస్తాను అని మాటిచ్చాడు. రామయ్య కంట్లో ఆనంద భాష్పాలతో తనకు అన్నం పెట్టిన కొట్టు ఇప్పుడు తన కూతురి ఆపరేషన్ కి కూడా ఉపయోగపడుతున్నందుకు ఎంతో సంతోషంతో అందుకు అంగీకరించాడు.

ఇచ్చిన మాట ప్రకారం రిషిత వాళ్ళ నాన్న లాస్య ఆపరేషన్ చేయించాడు. పది రోజుల తర్వాత లాస్య ఇంటికి చేరుకుంది. రిషిత వాళ్ళ నాన్నతో కలిసి లాస్యని చూడ్డానికి కొట్టుకి వచ్చి రామయ్య తాకట్టు పెట్టిన పత్రాలను తిరిగి ఇవ్వబోయింది. రామయ్యకి ఏమి అర్థం కాక చూస్తూవుంటే రిషిత వాళ్ళ నాన్న జరిగిన విషయం చెప్పాడు.

లాస్య నాకు కూతురే రామయ్య. ఇద్దరూ అక్కచెల్లెల్లా కలిసిమెలిసి ఉండేవారు. అలాంటిది లాస్యకి ఇలా జరిగితే ఎలా చూస్తూ ఉండగలను. అదీ కాకుండా ఈ కొట్టు అంటే లాస్యకి నా కూతురు రిషితకి ప్రాణం. ఈ కొట్టు వేరేవాళ్ళ చేతికి ఎలా పోనిస్తాను. ఈ విషయం నీకు ముందే చెబితే నువ్వు ఒప్పుకోవు అందుకే తాకట్టు పెట్టుకుంట అని చేప్పాను ఇదిగో కొట్టు పత్రాలు అని తిరిగి ఇచ్చాడు. అదంతా విన్న రామయ్య నోట మాట రాక ఆ “చిల్లర కొట్టు వైపు” అలా చూస్తూ ఉండిపోయాడు…..

***

You May Also Like

One thought on “లాస్య

  1. బాగుంది. ఇంకా ఆసక్తిగా వ్యాకరణ దోషాలు లేకుండా ట్రై చెయ్యండి..👍

Leave a Reply to రామకృష్ణ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!