మళ్లీ మొదటికే వచ్చింది

మళ్లీ మొదటికే వచ్చింది

రచన:: బండ్ల శ్వేత

“చూశావా వసంతా?? పిన్ని ఎంతపని చేసిందో?? కూతురు, అల్లుడు చెప్పిన మాటలు విని పాపం అమాయకురాలైన కోడల్ని పెళ్ళిలో చేసిన మర్యాదలు సరిపోలేదని, మళ్ళీ కట్నం తెమ్మని పుట్టింటికి వెళ్ళగొట్టింది. పాపం ఆ పిల్ల తల్లిదండ్రులు మాత్రం ఎక్కడి నుండి తీసుకురాగలరు. ఇంకా ఇద్దరు పెళ్లికెదిగిన కూతుళ్లు ఉన్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళే చేయాలా?? లేకపోతే పిన్ని అత్యాశలే తీర్చాలా? పాపం ఆ పిల్లను తల్చుకుంటే బాధతో అన్నం ముద్ద దిగట్లేదు నాకు. కథ మళ్లీ మొదటికే వచ్చింది. పిన్ని ఎప్పుడు మారుతుందో ఏమో?? మారినట్లే మారి మళ్లీ ఆ పిల్లను డబ్బులు తెమ్మని పుట్టింటికి పంపుతుంది. పాపం ఆ పిల్ల తల్లిదండ్రులు ఎన్నిసార్లని డబ్బులు సర్దుతారు. అంతా ఆ పిల్ల ఖర్మ చెల్లీ..” అంటూ వాళ్ళ చెల్లి వసంతతో ఫోన్లో మా ఆవిడ సుభద్ర మాట్లాడుతుంటే విన్నాను.
నాకు రక్తం మరిగిపోయింది. మా చిన్నత్త ఇలాంటిదా?? నేను ఎప్పుడు వెళ్ళినా నాతో చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంటే నమ్మి మోసపోయాను. మా ముందు చెల్లెమ్మతో ప్రేమగా మాట్లాడుతుంటే నిజంగానే బాగా చూసుకుంటోందని అనుకున్నాము. కానీ ఇదంతా నాటకమేనా.. అమ్మ చిన్నత్తా!! ఎంత మోసం? మళ్లీ మళ్లీ కట్నం కోసం మా చెల్లెమ్మను రాచి రంపాన పెడతావా?? అయినా మా బావమరిది గాడు ఏం చేస్తున్నాడు? చెల్లెమ్మను ప్రేమించే పెళ్ళిచేసుకున్నాడు కదా!?. మళ్ళీ కట్నం తెమ్మని మా చెల్లెమ్మని ఏడిపిస్తారా? వీళ్ళని ఇలానే వదిలేస్తే లాభం లేదు. అయినా ఇంత పెద్ద లాయర్ని నన్ను ఇంట్లో పెట్టుకుని మా ఆవిడయినా నాతో ఒక్కమాట కూడా చెప్పకుండా వాళ్ల చెల్లితో ఫోన్లో చెప్తుందేమిటి? బహుశా వాళ్ళ పుట్టింటివాళ్ళ పరువు పోతుందని నాతో చెప్పడం లేదేమో కానీ అవతల తనలాంటి ఓ ఆడకూతురు కష్టాలు పడుతుంటే కూడా ఆ పిల్ల ఖర్మ అని వదిలేసి ఊరుకుంటుందా?? ఇక ఊరుకుంటే లాభం లేదు.
” సుభద్రా.. ఓసారి ఇలారా.. ” గట్టిగా అరిచినట్టే పిలిచాను మా ఆవిడను. భయపడ్డట్లుంది క్షణంలో వచ్చేసింది.
“ఏమిటండీ? అంతలా గావుకేక పెట్టారు. ఏమయింది?” అని కంగారుగా అడిగింది.
“ఇంకా ఏం జరగాలి. చిన్నత్త ఇలాంటిదని కలలో కూడా అనుకోలేదు. చెల్లెమ్మను కట్నం కోసం వేధిస్తుందా?? మనముందు ఎంత ప్రేమగా నటిస్తుంది. పోనీ వాళ్ళమ్మంటే ముసలావిడ. ఏదో ఛాదస్తం కొద్దీ పెళ్ళిలో చేసిన మర్యాదలు సరిపోలేదని పెళ్ళయిన నాలుగేళ్ళ తర్వాత కూడా దెప్పుతుంటే, మీ తమ్ముడు గోపాల్ గాడు ఏం చేస్తున్నాడు? ప్రేమించే పెళ్ళి చేసుకున్నాడు కదా? మళ్ళీ మళ్ళీ కట్నం తెమ్మని చెల్లెమ్మను ఇబ్బంది పెడతారా? పాపం చెల్లెమ్మ ఎంత మంచిది కాకపోతే మీవాళ్ళు పెట్టిన కష్టాలను పంటి బిగువున భరించి, ఎవరికీ చెప్పుకోకుండా ఉంటుంది. నువ్వయినా ఏనాడయినా నాతో ఒక్క మాట చెప్పలేదేం? నేనిప్పుడే చెల్లెమ్మకూ, బాబాయి గారికి ఫోన్ చేసి మీ పిన్ని మీద, ఆ గోపాల్ గాడి మీద, మరదలు మీద, వాళ్ళాయన మీద కేసు పెట్టమని చెప్తాను. ఆడదంటే అబల కాదు.” అంటూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాను.
అంతలోనే మా ఆవిడ “అయ్యో.. అయ్యో.. ఏమిటండీ మీరు మాట్లాడేది?! మా పిన్నీ, గోపాల్, చెల్లెలు, మరిదిగారూ చాలామంచివారు. వాళ్ళ మీద కేసు పెట్టడమేమిటండీ. మహాలక్ష్మి లాంటి కోడలని మా పిన్ని మరదలిని ఎంత ప్రేమిస్తుందో మీకు తెలీదా?? అసలు పెళ్ళికే ఒక్క రూపాయి అడగలేదు. అన్ని ఖర్చులూ వీళ్ళే పెట్టుకుని చేసారు. ఇప్పుడు మరదలిని కట్నం తెమ్మని వేధించార‌ంటే ఎలా నమ్ముతున్నారు మీరు? అలాంటి మంచి వాళ్ళ మీద కేసు పెడతానంటారా మీరు? మతి గానీ గతి తప్పిందా ఏమిటి?” అంటూ చేతిలో ఫోన్ లాక్కుంది.
“అంతేలే.. నువ్వూ మీ పుట్టింటివాళ్ళతో చేరిపోయావు. అసలు సాటి ఆడకూతురు కష్టాలు పడుతుందన్న జాలి కూడా లేకుండా మాట్లాడుతున్నావు. కేసులో నీ పేరు కూడా చేరుస్తాను. భార్యవని కూడా చూడను ఏమనుకుంటున్నావో..?” అంటూ ఫోన్ లాక్కోబోయాను.
ఇంతలో మా ఆవిడ నెత్తీ నోరూ బాదుకుంటూ.. ” రామచంద్ర ప్రభూ.. మీకెవరు చెప్పారండీ.. మా పిన్ని గురించి ఇలా?? మా పిన్ని మరదలిని చిత్రహింసలు పెడుతుందని ఎవరు చెప్పారు?” అంటూ అమాయకంగా అడిగింది మా ఇంటావిడ.
” ఎవరు చెప్పడం ఏమిటి? నువ్వే కదా ఇందాక వసంతతో మీ పిన్ని తన కోడలిని మళ్లీ మళ్లీ కట్నం కోసం వేధిస్తోందని, మారినట్లే మారి మళ్ళీ తన కూతురు చెప్పుడు మాటలు విని కోడలని హింసిస్తోందని చెప్తుంటే విన్నాను. ఇంకా ఎవరో చెప్పడం ఏమిటి? నేను లాయర్ని చెప్పుడు మాటలు వినేవాడిని కాదు. నువ్వే చెప్పావు. అది నా చెవులారా విన్నాను. అందుకే మీ పిన్ని వాళ్ళ మీద కేసు పెట్టమని బాబాయి గారితో మాట్లాడతాను.” అంటూ బాబాయి గారికి ఫోన్ చేయాలని నంబర్ నొక్కబోయేంతలోనే.. మా ఆవిడ ఫోన్ లాక్కుని పక్కన పెట్టి ” మీరు ఇంత పెద్ద లాయరే గాని. బొత్తిగా సీరియల్ జ్ఞానం లేదండీ! మహానుభావా మేము మాట్లాడుకున్నది ఇత్తడిపళ్ళెం సీరియల్లో పిన్ని గురించి. మా పిన్ని గురించి కాదు. ఇంకా నయం. ముందే చెప్పారు. కేసు పెట్టాక చెప్పలేదు. అప్పుడు గానీ సీరియల్లో పిన్ని మీద కేసు పెట్టారని అందరి ముందూ జోకర్ లాగా నిలబడాల్సి వచ్చేది. ” అంటూ ఫక్కున నవ్వింది.
“హమ్మ బాబోయ్.. ఎంత గండం గడిచింది. లేకపోతే నలుగురిలో అభాసు పాలయ్యేవాడిని.. అయినా నిన్ను ఆ పాడు సీరియల్స్ చూడడం మానేయమని చెప్పాను కదా.. ఆ మధ్య మానేసినట్లు కూడా చెప్పావు కదా!.. బీపీ కూడా కంట్రోల్ లోనే ఉందన్నావుగా?!” సందేహంగా అడిగాను.
“అవునండీ.. ఆ పాత ఏడుపు గొట్టు సీరియల్స్ అన్నీ చూడడం ఎప్పుడో మానేసానండీ. మీరు చెప్పాక కూడా వినకుండా ఎలా ఉంటానండీ? ఇప్పుడు కొత్తగా ఇత్తడిపళ్ళెం, కంచుబిందె, రోలూ రోకలి, తిరగలిరాయి, ఇస్త్రీ పెట్టె, ఎంగిలి అంట్లు అని కొత్త సీరియల్స్ మొదలయ్యాయి కదండీ.. వాటిని మాత్రమే చూస్తున్నాను. పాతవి మానేసానండీ..” అంటూ సంబరంగా చెప్పింది మా ఆవిడ.
మళ్లీ మొదటికే వచ్చింది కథ. ఈవిడ సీరియల్ చూడడం మానేయడమనే కథ మళ్లీ మొదటికే వచ్చింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!