మన ఊరి సైన్యం

(అంశం::” సస్పెన్స్/హార్రర్/థ్రిల్లర్ “)

మన ఊరి సైన్యం

రచయిత :: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

chaitra sri

మామిడి తోట పక్క మర్రి చెట్టు ఊడలు పట్టుకొని ఊగుతున్న బన్ని కెవ్వుమని కేకేశాడు.తోటలో ఉన్న తండ్రి వెంకటేష్ పరుగు పరుగున మర్రిచెట్టు కిందకి వెళ్ళాడు.అక్కడ బన్ని లేకపోవడంతో భయపడి పోయి అరవడం మొదలెట్టాడు.చుట్టుపక్కల పని చేసుకుంటున్న వాళ్ళంతా వచ్చి అందరూ వెతికారు.బన్నీ ఎక్కడా లేడు.ఏటి పక్కన పుచ్చకాయల తోట యజమాని రాంబాబు చెమటలు కక్కుకుంటూ మర్రిచెట్టు దగ్గరకి వచ్చి బన్ని గొంతు అడవిలో వినిపిస్తుందని చెప్పడంతో అందరూ అడవి మొత్తం గాలించేశారు.ఎక్కడా కన్పించలేదు. ఆడుకుంటున్న పిల్లాడు ఎక్కడికెళ్ళుంటాడు?ఎవరైనా కిడ్నాప్ చేశారా?లేక చంపేశారా?అని రకరకాల ఆలోచనలు వెంకటేష్ మదిలో చక్కర్లు కొడుతున్నాయి.పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఇంటికెళ్ళాడు.ఇంటికెళ్ళేటప్పటికి భార్య శారద ఏడుస్తూ మంచానికతుక్కొని ఉంది.వెంకటేష్ “బిడ్డని ఎందుకు తీసుకెళ్ళానో..ఇంట్లో ఉండనని ఏడుస్తుంటే తీసుకెళ్ళానే,నన్ను క్షమించు శారదా..!”అంటూ శారద కాళ్ళు పట్టుకోబోయాడు. కాళ్ళు విపరీతంగా కాలిపోతున్నాయ్.వెంకటేష్ శారదని హడావిడిగా ఆస్పత్రికి తీసుకెళ్ళాడు.ఇంట్లో ఎవరూ లేరు.అది తెలియని శారద వాళ్ళ నాన్న కన్నయ్య వచ్చాడు.అప్పుడే చీకటి పడుతూ ఉంది. ఇంటికి తాళం వేసి ఉండడంతో వేపచెట్టుకింద మంచం వేసుకొని కునుకు తీశాడు.ఉన్నట్లుండి వేప చెట్టు మీద నుంచి ఏదో తన పైకి దూకినట్లనిపించి ఉలిక్కిపడి లేచాడు.పక్కనెవరూ లేరు.కాలికి ఏదో తగిలినట్లపించింది. కాళ్ళు గబుక్కున మంచంపైన పెట్టుకొని మంచం కింద వంగి చూశాడు. ఎవరో తలకి గుడ్డ చుట్టి లాక్కొంటూ వెళ్ళి ఇంటికి చుట్టూ నాటిన కంప లో విసిరేశారు. కన్నయ్యకేమీ అర్థం కావట్లేదు. ఎవరూ కన్పించట్లేదు. కానీ ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటూ ఒంటికి గుచ్చుకున్న ముల్లు తీసుకుంటూ మంచం దగ్గరికెళ్ళాడు. ఆ చీకట్లో ఏమీ కనపడట్లేదు. మంచం మీద ఏదో ఉన్నట్లనిపించి కాలు పెట్టాడు.ఏదో కాలిని గట్టిగా మెలేసి చుట్టేసింది.భయంతో కేకలు వేస్తున్నా ఎవరూ రావట్లేదు.వేపచెట్టు మొదలుని గట్టిగా పట్టుకొని చెట్టెక్కే ప్రయత్నం చేస్తూ కాళ్ళకి చుట్టేసిన దాన్ని విడిపించుకొని చెట్టెక్కేశాడు.చెట్టుపై ఎదురుగా కొమ్మపై ఎవరో ఉన్నట్లపించి కళ్ళు నలిపి చూశాడు. తెల్లగా దెయ్యం లాంటి రూపం దర్శనమిచ్చింది. కన్నయ్య గొంతు పెగలడంలేదు.ఒక్కసారిగా ఆ దెయ్యం కన్నయ్య పీక పట్టుకొని చెట్టు కొమ్మకి తగిలించేసింది. విచిత్రమేమిటంటే దెయ్యం పట్టుకుంటే దెయ్యం స్పర్శ తెలుస్తూ ఉంది.కన్నయ్య దిక్కు తోచని స్థితిలో ఉండగా
వెంకటేష్ ,శారద వచ్చారు.ఇంట్లోకెళ్ళి లైట్లు వేస్తే వెలగలేదు కరెంట్ పోయిందనుకొని పక్కనిళ్ళలో చూస్తే ఊరంతా ఉంది.శారదని వరండాలో కూర్చోబెట్టి ఏమైందో చూద్దామని మెయిన్ స్విచ్ దగ్గరికెళ్ళాడు.అక్కడ ఏం చూశాడో కాని పరిగెత్తుకుంటూ వచ్చి శారద తో “శారదా..!అక్కడ అక్కడ ..”అంటూ సెల్ ఫోన్ లైట్ వేసి రా చూద్దాం అంటూ ఇద్దరూ వెళ్ళి చూశారు.బన్నీ స్పృహ తప్పి పడి ఉన్నాడు.చనిపోయాడేమోనని వెంకటేష్ టెన్షన్ తో హడలెత్తిపోయాడు.శారద మాత్రం ఏం కాదు భయపడకండి నీళ్ళు తీసుకురండి అంటూ బన్ని బుగ్గలను కొడుతూ ఉంది అయినా లేవలేదు.వెంకటేష్ తొట్టె దగ్గరికెళ్ళి నీళ్ళు తెస్తూ వేపచెట్టువైపు చూశాడు. కన్నయ్య చెట్టుకి వేలాడడం చూసి షాక్ అయ్యాడు. కళ్ళుతిరిగి పడిపోయాడు.చాలా సేపవుతున్నా వెంకటేష్ రాకపోవడంతో శారద ఏవయ్యా అని అరుస్తూ నీళ్ళకోసం వెళ్ళింది సెల్ ఫోన్ లైటింగ్ మంచం పక్కనే ఉండడంతో దగ్గరికెళ్ళి చూసి వెంకటేష్ ను నీళ్ళు చల్లి లేపింది.వెంకటేష్ శారదకు చెట్టుపై వాళ్ళ నాన్న ఉన్నాడని చెప్పకుండా “ఏం లేదే..రాయి తగిలి పడ్డాలే అంటూ నీళ్ళు తీసుకెళ్ళు “అని బన్నీ దగ్గరికి పంపించాడు.ఈ లోపు చెట్టు పైకెక్కి కన్నయ్యని దించి “ఏం మామయ్యా నువ్వెప్పొడొచ్చావ్..!”అంటూ పలకరించాడు.కన్నయ్య “అల్లుడూ..అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుందిరా,నన్ను ఎవరో భయపెట్టేశారు. చచ్చేంత పని చేశారు.చెట్టు మీద చూస్తే దెయ్యం” అన్నాడు.బన్నీ బాత్రూం గోడ దగ్గరున్నాడు పద మావా అంటూ ఇద్దరూ వెళ్ళారు.బన్నీ శారద మాట్లాడుకుంటూ ఉన్నారు.ఫీజు ఎగిరిపోయుండడం చూసి వెంకటేష్ ఫీజు వేసేసి అందరూ ఇంట్లోకి వెళ్ళారు.ఊర్లో అంతా వెంకటేష్ కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారు.ఆ ఊరి నాయకుడు బుజ్జిరెడ్డి మీద అనుమానం వ్యక్తం చేశారు.బన్నీ ఇంటికి చేరాక వెంకటేష్ పంచాయితీ దగ్గరికెళ్ళి అందరితో మాట్లాడాడు.”మా బన్నీ ని అడిగితే ఎవరు ఎత్తుకెళ్ళింది తెలియదు కానీ మన ఊరు వాళ్ళు కాదని చెప్పాడు.ఎవరు నన్ను ఇబ్బంది పెడుతున్నారో తెలుసు.నన్ను ఎవరూ ఆపలేరు.మా కుటుంబాన్ని హతమార్చినా నా పోరాటం ఆగదు” అని చెప్పాడు.జనాల్లోంచి రంగయ్య మావ “ఒరేయ్ ఎకటేశా నువ్వొక్కడివే మనూర్లో బాగా సదువుకున్నోడివి , ఉన్నోడివి గూడా.నువ్వు చేసే పని చాలా మంచిది.ఈ ఊరికి పట్టిన శని బుజ్జిరెడ్డే నిన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడని మాకూ తెలుసు.అందుకే సాయంత్రం మీటింగ్ పెట్టి ఒక నిర్ణయం తీసుకున్నాం.బుజ్జిరెడ్డి ఊచలు లెక్కబెట్టే వరకూ మీ ఇంట్లో రోజుకి ముగ్గురు కాపలా ఉంటాం.నువ్వు చెయ్యాల్సింది నువ్వు ధైర్యంగా చెయ్.మీ ప్రాణాలకి మా ప్రాణాలడ్డేస్తాం “అంటూ వెంకటేష్ వెనక బలమైన సైన్యం ఉందని ధైర్యం నింపాడు.వెంకటేష్ “మావా మీరందరూ నా వెనక ఉన్నారనే ధైర్యంతోనే పోరాడుతున్నా.మన కోసం పోరాడుతా”అన్నాడు.రంగయ్య “ఎంకటేశా నీ యనక “మన ఊరి సైన్యం” ఉంటాది.నువ్వేమీ భయపడద్దు”అన్నాడు.గుంపులో ఏమీ తెలియని ఎర్రన్న ఒరేయ్ ఈడు జేసే పోరాటం ఏందిరా అన్నాడు. దానికి వెంకటేష్ “ఎర్ర మావా..ఏం లేదు బుజ్జి రెడ్డి మన ఏటి ఇసుక ను దొంగతనంగా ఇతర రాష్ట్రాలకి అమ్ముకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని నిలదీశా.ఆయన నువ్వెవడురా నా ఇష్టం ఊరు నాది మీరెవర్రా అడిగే దానికి ఓటరు కుక్కల్లారా అంటూ అందరినీ తిట్టడంతో కోపం వచ్చి కంప్లైంట్ ఇచ్చా.దానిపై కమిటీ వేశారు అందుకే నన్ను భయపెట్టి కేసు విత్ డ్రా చేయించాలని చూస్తున్నారు.దానికోసమే మా ఇంటి చుట్టూ దెయ్యాల్లాగా రౌడీలు భయపెడుతూ ఉన్నారు.బన్నీని కిడ్నాప్ చేశాక ఆ కంప్లైంట్ లో కూడా బుజ్జిరెడ్డి మీదే అనుమానం ఉందని రాశా దాంతో బన్నీని వదిలిపెట్టేశారు.”అంటూ జరిగిన విషయాన్ని చెప్పడంతో ఎర్రన్న “ఒరేయ్..ఎంకటేశా ఆయన నాయకుడైతే ఏటి ఇసక ఆయన అబ్బ సొత్తా మన పంచాయితీకి రావలిసిన డబ్బుని ఆయన జేబులో ఏసుకుంటే ఈడెవరూ గాజులు తొడుక్కోలేదని సెప్పు.నీకు మేమున్నాం “అంటూ ఎర్రన్న ఎర్రజెండా ఎగరేశాడు.తరువాత రోజు పోలీసులు బుజ్జిరెడ్డిని అరెస్ట్ చేయడంతో గొడవలు సర్దుమనిగాయి.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!