ఓసి నా ఇంట్లో బంగారం పోయే!

( అంశం::”ఓసి నీ ఇల్లు బంగారం గానూ”)
ఓసి నా ఇంట్లో బంగారం పోయే! 

రచన::వెంకట శివ కుమార్ కాకు

“ఓసి నీ ఇల్లు బంగారంగానూ! సినిమా టైటిల్ ఎలా వుంది సర్” చాలా ఉత్సాహంగా అడిగాడు డైరెక్టర్ ఉపేంద్ర. సమాధానం చెప్పకుండా మౌనంగా వుండి పోయాడు నిర్మాత సుందరం. “ఏంటి సర్? ఇంకా ఆలోచిస్తున్నారు?” అని చిన్నగా అడిగాడు. “ఇంట్లో వున్న డబ్బు, బంగారం మొత్తం పెట్టి సినిమా తీస్తున్నాను. ఈ సినిమా టైటిల్ ఏంటి ఇలా వుంది?” అని తన సంశయం బయట పెట్టాడు. “నేను చెప్పబోయే కథకి ఈ టైటిల్ సరిగా సరిపోతుంది. నన్ను నమ్మండి” అని డైరెక్టర్ ధైర్యం చెప్పాడు.

“ఈ సినిమా తీశాక నా ఇల్లు బంగారం అవుతుందో! కష్టపడి సంపాదించిన బంగారం మొత్తం పోతుందో!” అని తనలో తానే సుందరం అనుకున్నాడు. “ఇక మీరు ఏం ఆలోచించకండి. ముందు కథ వినండి. ఆ తర్వాత మీరే ఆనందంతో ఎగిరి గెంతేస్తారు” అని కథ చెప్పడానికి ఉపేంద్ర సిద్ధం అయ్యాడు. సుందరం అలానే తన వైపే చూస్తున్నాడు.

ఉపేంద్ర గొంతు సవరించుకున్నాడు. “మన కథలో హీరో పేరు బికారి” అని అన్నాడు. ఆ పేరు విని సుందరయ్య బిత్తర చూపులు చూసాడు. డైరెక్టర్ ఉపేంద్ర అవేమీ పట్టించుకొనే పరిస్థితిలో లేడు. “మన ఈ బికారి హీరో. చాలా పేదవాడు. చిరిగిన చొక్కా. జారిపోయే ప్యాంట్. చింపిరి జుట్టు. ముఖం అంతా మసి మసిగా నల్లగా వుంటుంది” వెలిగిపోతున్న ముఖం తో చెప్పాడు. ఈ మాటలు విని సుందరయ్య ముఖం పాలిపోయింది.

“ఇందులో మనకి చాలా ఉపయోగాలు వున్నాయి. హీరో మేకప్ కి పెద్ద ఖర్చు వుండదు” అని నవ్వుతూ చెప్పాడు. ఖర్చు తగ్గుద్ది అనే మాట వినగానే సుందరయ్య కళ్ళు కాస్త పెద్దవి అయ్యాయి. “కథలో హీరోయిన్ వుంటుందా లేదా?” అని సుందరయ్య ఉత్సాహంగా అడిగాడు. “ఏయ్ ఏయ్ మా సారు దారిలో పడ్డాడు” అని ఉపేంద్ర ఆట పట్టించాడు. “హీరోయిన్ ఎందుకు వుండదు. ఖచ్చితం వుంది. పైగా మన కథలో హీరోయిన్ బంగారు బొమ్మ” అని చెప్పాడు.

“బొమ్మనా ? అంటే మనిషి కాదా? మనిషిని చేసేంత బంగారం మన దగ్గర ఎక్కడ వుంది?” అని సుందరం తడబడుతూ అన్నాడు. ఉపేంద్ర నవ్వుకున్నాడు.”బంగారం బొమ్మ అంటే అంత అందంగా వుంటుంది. పైగా తను సిటీ లో వున్న ఒక పెద్ద బంగారు షాప్ ఓనర్ కి ఒక్కగానొక్క గారాల కూతురు. అందుకే బంగారు బొమ్మ అని చెప్పాను” అని వివరించాడు.

“హీరో బికారి. హీరోయిన్ బంగారు బొమ్మ. వీళ్ళిద్దరికీ ఎలా ముడి పడింది?” అని సుందరం తన అనుమానం బయట పెట్టాడు. “అక్కడికే వస్తున్నా సర్” చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు. సుందరం ఆసక్తిగా చూస్తున్నాడు. “ఒక రోజు. అర్ధరాత్రి అయ్యింది. బికారి ఆ బంగారం షాప్ ముందు పడుకొని వున్నాడు. ఆ షాప్ లోపల నుంచి ఏదో అలికిడి అవుతోంది. బికారికి నిద్ర పట్టడం లేదు. షాప్ తలుపుకి చెవులు ఆనించి విన్నాడు. ఇంకా ఏవో శబ్దాలు వస్తున్నాయి. మళ్ళీ పడుకున్నాడు. అదే అలికిడి. బాగా కోపం వచ్చింది. లేచి నిలబడి చుట్టూ చూసాడు. ప్రతీ షాప్ ముందు ఎవరో ఒకరు పడుకొని వున్నారు. ఖాళీ లేదు. చిరాకు వచ్చింది. అక్కడే కూర్చున్నాడు” అని చెప్పి కథ చెప్పడం ఆపాడు.

“ఎందుకయ్యా కథ చెప్పడం ఆపావు? అని ప్రొడ్యూసర్ సుందరం కోపంగా అన్నాడు. ఉపేంద్ర కాసిని మంచినీళ్లు తాగాడు.చిన్నగా నవ్వాడు. “ఇప్పుడు ఆ నవ్వుకి కారణం ఏంటి?” అని మరింత కోప్పడ్డాడు. “కథ చెప్పడం మధ్యలో ఆపేసావు. పైగా ఈ వెకిలి నవ్వు” అని రెట్టించిన కోపంతో అన్నాడు. “ఇదొక వ్యూహం సర్. కథ చెప్పడం మధ్యలో ఆపేయాలి. అప్పుడు ఎదుటివాడి చిరాకుని బట్టి కథ అతనికి ఎంత నచ్చిందో కనిపెట్టొచ్చు” అని నవ్వుతూ అన్నాడు. “ఏడ్చినట్టుంది నీ వ్యూహం. ముందు తర్వాత కథ చెప్పు” అని సుందరం తొందర పెట్టాడు.

“ఆ బంగారు షాప్ ని దోచుకోవాలి అని చాలా రోజుల నుంచి ఒక దొంగల ముఠా ప్రణాళిక వేసుకుంది. ముందుగా అనుకున్నట్టే ముగ్గురు గొయ్యి తీసి లోపలికి వెళ్లారు. ఒకడు బయట కాపలా వుండాలి. దోచుకున్న బంగారం సంచీల్లో సర్ధి బయటకి విసిరేస్తారు. ముందుగానే ఒక చెత్త బండిని దొంగిలిస్తారు. అందులో సంచీలు వేసుకొని పారిపోవాలి. ఇది వాళ్ళ ప్రణాళిక” అని చెప్పి కథ ని మళ్ళీ అక్కడ ఆపాడు.

ఈసారి సుందరం రెండు గ్లాస్ ల నీళ్ళు ఆపకుండా తాగేసాడు. “ఈ కథలో మలుపు ఏంటి?” అని నీరసంగా అడిగాడు. “అక్కడికే వస్తున్నాను” అని సుందరం కళ్లలోకి సూటిగా చూస్తూ అన్నాడు. “మన హీరో బికారి. వీధి వీధి తిరిగి చెత్త తీస్తుంటాడు. ఆ దొంగలు కొట్టేసిన చెత్త బండి మన బికారి హీరోదే. ఆ రోజు నిద్ర పట్టక అక్కడ నుంచి లేస్తాడు. పక్కనే ఇంకో వీధిలోకి వెళ్తాడు. అక్కడ తన చెత్త బండి కనిపిస్తుంది. దాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. చూసుకోకుండా ఆ చెత్త సంచులు తన గుడిసెలో పడేస్తాడు. అలా వాడి ఇల్లు మొత్తం
బంగారం అయ్యింది” అని ఉత్సాహంగా అన్నాడు.

“కథ అయిపోయిందా? మరి బంగారు బొమ్మ హీరోయిన్ ఎక్కడ?” అని అనుమానంగా అడిగాడు. “కథ పూర్తి కాలేదు. ఇది ఇంటర్వల్. బంగారం షాప్ యజమాని పోలీసు ల సాయంతో దొంగల కోసం వెతకడం. దొంగలు బికారి కోసం వెతకడం. ధనవంతుడి గా మారిన బికారి బంగారు బొమ్మ తో ప్రేమ లో పడుతాడు. ఇంటర్వల్ తర్వాత సినిమా పూర్తిగా థ్రిల్లర్ లా వుంటుంది. తాను అనుభవిస్తున్న బంగారం హీరోయిన్ దే అని మన బికారి హీరో తెలుసుకుంటాడు. ఆ రోజు హీరోలో మార్పు వస్తుంది. సంచీలు తీసుకొని వెళ్ళి బంగారు షాప్ యజమానికి ఇచ్చేస్తాడు. మన హీరోలో నిజాయతి చూసి తన కూతుర్ని బికారికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఎలా ఉంది సర్ అంతిమ ఘట్టం?” అని చెప్పి సుందరం వైపు గర్వంతో చూస్తాడు.

సుందరం గొంతు సవరించుకున్నాడు. “ఓసి నీ ఇల్లు బంగారంగానూ! టైటిల్ సరిపోదు డైరెక్టర్” అని సుందరం వస్తున్న కోపం ఆపుకుంటూ అన్నాడు. “కథ విన్నారు. మీరే ఏదైనా మంచి టైటిల్ చెప్పండి సర్” అని డైరెక్టర్ వినయంగా అన్నాడు.”ఓరినీ చెత్త కథ! సరిగ్గా సరిపోద్ది” అని కోపంగా అరిచాడు. ఆ కోపం చూసి డైరెక్టర్ అక్కడ నుంచి పారిపోయాడు. “ఇలాంటి డైరెక్టర్ తో సినిమా తీస్తే ఓసి నా ఇంట్లో బంగారం పోయే! అని పాడుకుంటూ చెక్క భజన చేసుకోవాలి” అని తనని తానే తిట్టుకుంటూ తల వాల్చి పడుకున్నాడు. వెంటనే నిద్ర పట్టేసింది. “బికారి హీరో ఇళ్ళంతా బంగారం. ఒళ్ళంతా బంగారం వేసుకొని సుందరం వైపు చూసి వెకిలిగా నవ్వుతున్నాడు” ఈ కలతో ఉలిక్కిపడి లేచాడు. వెంటనే వెళ్ళి బీరువలో వున్న బంగారం లెక్క చూసుకున్నాడు. గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!