తెలివైన కోడలు

అంశం:: (“ఎవరికి వారే యమునా తీరే..” )

తెలివైన కోడలు

రచన: సుశీల రమేష్.M

శాంతి మనసంతా అల్లకల్లోలంగా ఉంది. కారణం తన ఆడపడుచు రజిని.

శాంతి పెళ్లై ఐదు సంవత్సరాలయింది. నాలుగేళ్ల పాప శాన్వి ఉంది. భర్త శ్రీనివాస్ బ్యాంకు ఉద్యోగి. అత్త కాంతమ్మ, మావయ్య రామయ్య వ్యవసాయం చేస్తారు. మరిది వెంకట్ ఎంబీఏ చదువుతున్నాడు.

శాంతి వంట బాగా చేస్తుంది. పనులన్నీ చక్కగా చేసుకుంటూనే ఉద్యోగం చేస్తుంది తను వీఆర్వో.
ఇంట్లో వాళ్ళంతా శాంతిని బాగా చూసుకునే వారు.

రజనీ భర్త యాక్సిడెంట్లో చనిపోవడంతో ఇంటికి తీసుకువచ్చారు రజనీని, తనకు ఇద్దరు ఆడపిల్లలు భాగ్య ధన్య. చిక్కంతా రజినీ తోనే . శాంతిని ఎవరైనా మెచ్చుకుంటుంటే రజినీకి నచ్చేది కాదు. ఇంట్లో నాన్న అన్నయ్య తమ్ముడు ఉన్నంతసేపు పని చేస్తున్నట్టు నటించేది. ఎలా అంటే ఒక ఉదాహరణ చెప్తాను. పొలంలో పండిన మినుములు వాడతారు ఇంట్లో వాటిని తిరగలి మీద విసిరి బద్దలు చేస్తారు..ఆ పప్పుని టిఫిన్లకు వాడతారు. నానబెట్టిన పప్పును గంట సేపు కడిగేది రజనీ. శాంతి వంట చేస్తున్నంతసేపు అటు వైపు కూడా వచ్చేది కాదు రజిని కానీ వంట పూర్తవగానే తనకు తన పిల్లలకు ముందుగానే వడ్డించుకుని తినేసేది. చచ్చినట్లు శాంతి కి మళ్లీ వంట చేయాల్సి వచ్చేది. అయినా కూడా శాంతి ఏనాడు విసుక్కునేది కాదు. ఇంట్లో అందరూ ఉంటే అయ్యో వదిన ఆ పని అలా కాదు ఈ పని ఇలా కాదు. ఈ వంట అలా చేయకూడదు . తొందరగా వంటచేయు వదిన మా నాన్నగారు ఆకలికి ఆగలేరు అనేది .బట్టలు ఉతికావు కానీ మురికి వదలలేదు అంటూ అందరి ముందు అవమానించేది.రజని.

చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయమని చెప్పేది. అయ్యో అన్నం ఉడక లేదు.
వదిన అది తింటే అందరికీ కడుపు నొప్పి వస్తుంది. కాబట్టి కాస్త శ్రమ అనుకోకుండా మళ్ళీ వండరాదూ, కూరలో కూడా ఉప్పు ఎక్కువైంది మళ్ళీ వండు అనేది తనే ఉప్పు కలిపి రజిని. చాలా ఆకలిగా ఉంది వదిన తొందరగా వంట చేయవా అని అడిగేది రజిని.

అక్క నువ్వు వచ్చిన దగ్గర నుండి అది చెయ్ వదిన ఇది చెయ్ వదిన అనకపోతే నువ్వే వండుకో వచ్చు కదా అన్నాడు వెంకట్.

దానికి ఏం ఖర్మ రా వండాలని ఇంట్లో ఎవరూ లేరా చేసేవాళ్ళు అంటాడు తండ్రి రామయ్య.

అలాగే ఆరు నెలల నుండి పీడించు కొని తింటుంది రజిని శాంతిని. ఆఫీస్ కి వెళ్ళిన శాంతి దిగులుగా కూర్చుంది. అది గమనించిన తన కొలీగ్ వయస్సులో కొంచెం పెద్ద శాంతి కన్నా తన పేరు సునీత, శాంతి ఏంటి దిగులుగా ఉన్నావు అని అడిగింది సునీత. శాంతి సునీత ను అక్క అని పిలుస్తుంది.

దిగులు అంటే అక్క మా ఇంట్లో నాకు స్వేచ్ఛ లేకుండా పోయింది.
నా ఆడపడుచు ఆరు నెలల నుండి నన్ను ముప్పుతిప్పలు పెడుతుంది. అంటూ క్లుప్తంగా వివరించింది శాంతి. రజిని వచ్చిన దగ్గరనుండి
ఇంట్లో వాళ్ళ ప్రవర్తన కూడా మారిపోయింది అక్క ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా నన్ను అన్ని రకాలుగా ముప్పుతిప్పలు పెడుతున్న అవమానిస్తున్న ఎవరూ నోరు మెదపడం లేదు అక్క. ఆఖరికి నా భర్త కూడా నోరు మెదపడం లేదు. నాకైతే ఆ చాకిరీ చేయలేక అందరి ముందు అవమానం భరించలేక చావాలనిపిస్తుంది. కాకపోతే నా కూతురు ఏమైపోతుందో అని ఓర్చుకుంటున్నాను అని చెప్పింది శాంతి.

పిచ్చిదాన అన్ని సమస్యలకు చావే పరిష్కారం కాదు. నీ భర్త మౌనానికి కారణం తన చెల్లెలు భర్త పోయి ఒంటరిగా అయిపోయిందని సింపతి అయ్యుండొచ్చు, అందుకే చెల్లెలు మాట నెగ్గి స్తున్నాడేమో . తల్లిదండ్రులు ఆమెకు సపోర్ట్ చేస్తారు కూతురు కాబట్టి. అందుకని ఇకనుంచి నీ తెలివిని ఉపయోగించి ఇలా చేయి అంటూ ఉపాయం చెప్పింది సునీత.

నిజమా అక్క అంటుంది శాంతి.

అవునే పిచ్చిదానా తన ప్రశ్ననే తనకు జవాబుగా అప్పచెప్పు ఇక విజృంభించు అంటుంది సునీత.
ఓకే డన్ అక్క అంటుంది శాంతి.

సాయంత్రం ఇంటికి వెళుతూ చికెన్ షాప్ లో చికెన్ తీసుకుని ఇంటికి వెళ్ళింది శాంతి. వంట చేయడానికి అన్ని సిద్ధం చేసింది శాంతి. మిగతావారంతా టీవీ చూస్తున్నారు.
రజిని నువ్వు జొన్న రొట్టెలు చికెన్ పులుసు బాగా చేస్తావంట కదా కొంచెం నాకు నేర్పవూ కిచెన్ లోకి వచ్చి అని అంటుంది శాంతి. పైగా నేను చేస్తే నీకు నచ్చదాయే అంటుంది శాంతి.

వెళ్ళమ్మా వదిన అంతగా అడుగుతుంటే కాదని అనకూడదు అంటాడు తండ్రి రామయ్య.

మూతి మూడు వంకర్లు తిప్పుతూ
వెళ్ళింది రజనీ. శాంతి వంటంతా రజనీతో చేయించింది.

బట్టలు ఉతికేటప్పుడు కూడా రజని నేను బట్టలు ఉతకడానికి వెళుతున్నాను మళ్ళీ మురికి వదల లేదు అంటావు వచ్చి చూడు అని శాంతి ఎంతో సౌమ్యంగా అడిగేసరికి
వెళ్ళమ్మ వదిన పిలుస్తుంది కదా అంటుంది తల్లి కాంతమ్మ. రజిని చేత బట్టలన్నీ ఉతికించింది. తను ఆరబెట్టింది శాంతి.

శాంతి ఇలాగే అందరి ముందు ఎంతో సౌమ్యంగా అడుగుతుండే సరికి తప్పదు అనుకుంటూ చేస్తుంది రజిని. అయినా నా మానాన నేను ఇంత తిని ఉండక ఎందుకు పెద్ద పోటుగత్తెలా ఫోజు కొట్టాలి ఈనాడు కుడితిలో పడ్డ ఎలుకల ఎందుకు కొట్టుకోవాలి.
అంతా నా ఖర్మ కాకపోతే అని మనసులో అనుకుంటూ రజిని అన్ని పనుల్లో శాంతికి సాయం చేయడం మొదలుపెట్టింది.

థాంక్స్ సునీత అక్క అని ఫోన్ చేసి చెప్పింది శాంతి. నాదేముంది శాంతి అంతా నీ తెలివే కాకపోతే నేను గుర్తు చేశాను అంతే అంటుంది సునీత.

శాంతి తన తెలివితేటలతో తనే తన సమస్యకు పరిష్కారం చూపింది.
సమస్య వచ్చినప్పుడు దిగులు పడకూడదు ఎదిరించి పోరాడాలి ప్రతి వారికి తెలివిఉంటుంది. తెలివి ఒక్కరి సొత్తు కాదు. ఆలోచన కూడా ఉంటుంది. కొద్దిపాటి ఆలోచన జీవితాన్ని మారుస్తుంది.

సెలవు🙏

****సమాప్తం***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!