వ్యక్తిత్వం

(అంశం::” సస్పెన్స్/హార్రర్/థ్రిల్లర్ “)

వ్యక్తిత్వం

రచయిత :: బండి చందు

ప్రతిరోజు పడుకోగానే నిద్రపట్టేసే నాకు ఆరోజు ఎందుకో అర్ధరాత్రి దాటుతున్నా కంటి మీద కునుకు పడలేదు. కారణం కూడా తెలుసుకోవాలని అనిపించలేదు. సమయం అర్ధరాత్రి రెండు కావోస్తుంది. అర్థంలేని ఆలోచనలతో మది సతమతమవుతున్నది. నిశ్శబ్దం రాజ్యమేలుతున్న చప్పుడు చెవులను కాక హృదయాన్ని గట్టిగా తాకుతున్నది. గుండె వేగం అదుపు తప్పడంతో ఒంట్లో వణుకు పుట్టి మంచినీళ్ళ కోసం కిందికి వెళ్ళాను. కిచెన్ అంతా చీకటిగా ఉంది నా కళ్ళు నీళ్ళ బాటిల్ కోసం వెతుకుతున్నాయి. ఇంతలో ఏదో తెలియని ఆకారం ఓ మూల నన్నే చూస్తున్నట్టు అనిపించింది. అప్పటికే భయంతో ఉన్న నాకు చెమటలు పట్టేసాయి శరీరం కంపించిపోతున్నది. ఆ ఆకారం నేనెప్పుడూ చూసిందిలేదు అదీ మా ఇంట్లో అస్సలు చూడలేదు. ఆ ఆకారం చీకట్లో తెల్లగా మెరుస్తూ నన్ను సమీపిస్తున్నది. నేనెంత అరిచిన నా గొంతులో మాట పెదవి దాటి ఎవరి చెవిని తాకట్లేదు. అరిచి అరిచి నా గొంతు ఎండిపోయిది. ఆ ఆకారం నన్ను చేరి చందు అని పిలిచింది. ఇక నాలో ధైర్యం చచ్చిపోయింది. కానీ ఆ గొంతు ఒక అమ్మాయిది ఇంతకుముందు చాలా సార్లు విన్నట్టు అనిపించింది. బాగా తెలిసిన గొంతే అది. భయం భయంగానే ఎవరు నువ్వూ అని అడిగాను. తను గద్గద స్వరంతో గుర్తుపట్టలేదా నన్ను అని అంటుండగానే గొంతు గుర్తుపట్టాను.

తన పేరు లావణ్య. నా పీజీ ఫ్రెండ్. ఎప్పుడూ ఎంతో యాక్టీవ్ గా ఉండేది. చాలా తెలివైన అమ్మాయి తన పరిచయం నన్ను నాకు తెలిసేలా చేసింది. ఎప్పుడూ ఏదోలా నాకు సహాయం చేస్తుండేది. పీజీ అయిపోయిన తరువాత నేను మళ్ళీ తనను కలవలేదు. తన నుండి ఫోన్ కూడా రాలేదు ఫ్రెండ్స్ ని అడిగితే వాళ్ళకి కూడా కాంటాక్ట్ లో లేదని తెలిసింది. ఎన్ని సార్లు ఫోన్ చేసినా తీయలేదు కొన్ని రోజులకు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇక నేను కూడా మళ్ళీ తనకి ఫోన్ చేయలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు తనని తిట్టుకోని క్షణం లేదు. చాలా రోజుల తర్వాత ఇప్పుడే తన గొంతు మళ్ళీ వింటున్నాను. లావణ్య అని నమ్మకం వచ్చాక ధైర్యం వచ్చింది. అయినా తను ఇంత అర్ధరాత్రి మా ఇంట్లో ఎం చేస్తుందో అసలు ఎందుకు వచ్చిందో తెలియక ఎన్నో ప్రశ్నలతో ఏమి మాట్లాడక తనను అలాగే చూస్తున్నాను.

తను నన్ను చూసి ఎంతో ఆనందంతో గట్టిగా హత్తుకుంది. కానీ తన స్పర్శ నాకు మునుపటిలా అనిపించలేదు. అసలు స్పర్శే లేదు భయం మళ్ళీ ఆవహించేసింది. ఇక ఉండలేక ఏమి జరిగింది అసలు ఇన్ని రోజులు ఏమయిపోయావ్ అని అడిగాను. నా ప్రశ్నకి బదులుగా తాను చందు నా గురుంచి నీకు తెలుసుగా ఎవరైనా ఆపదలో ఉంటే నేను చూస్తూ వుండలేనని నలుగురికి మంచిచేసే ఆ వ్యక్తిత్వమే నన్ను ఇలా దెయ్యంగా మార్చింది అని చెప్పింది. దెయ్యం అన్న మాట వినగానే నాకు మూర్ఛ వచ్చినంత పనయింది. భయంతోనే తాను చెప్పేది వినడానికి ప్రయత్నిస్తున్న.

చందు మన పీజీ అయిపోయాక నేను మా ఊరు వెళ్ళడానికి హాస్టల్లో బ్యాగ్ సర్దుకుంటున్న. ఇంతలో మా ఫ్రెండ్ ఫోన్ చేసి బయటకు రమ్మంటే వెళ్ళాను. తన దగ్గరికి వెళ్ళగానే నన్ను పట్టుకొని ఏడుస్తుంది. ఏమైంది అని అడిగాను అంతలోపే అక్కడికి తనను ప్రేమించిన అబ్బాయి వచ్చాడు. కానీ అతనంటే తనకి ఇష్టం లేదు. ఎంత చెప్పినా వినకుండా తన వెంటపడి ప్రేమించమని వేధిస్తున్నాడు. ఇప్పుడు కాలేజ్ అయిపోయి తను ఇంటికి వెళ్లిపోదామని అనుకుంటే నన్ను ప్రేమించు లేదంటే చెంపేస్తాను అని బెదిరించాడు. నేను చూస్తూ వుండగానే కోపంతో కత్తి తీసి తనని పొడవబోయాడు. నేను నా ఫ్రెండ్ కి ఏమి కాకూడదని అడ్డు పడ్డాను అతను నన్ను పొడిచి భయంతో పారిపోయాడు. నేను అక్కడే కుప్పకూలిపోయాను ఏమి జరుగుతుందో తెలిసేలోపే అంతా అయిపోయింది అని చెప్పి మాయమైపోయింది. నేను మళ్ళీ ఎంత పిలిచినా అరిచినా తను పలకలేదు.

అరిచి అరిచి గొంతు మూగబోయి కారణం తెలుసుకోకుండా తనను అనవసరంగా తిట్టినందుకు నాపై నాకే అసహ్యం వేసి అక్కడే చీకట్లో శిలనై నిలబడిపోయాను…

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!