కలలసౌధం

కలలసౌధం

అంశం:: పల్లెను మరచిన బ్రతుకులు 

 హైటెక్ సిటీ లో రెండు పెద్ద లగ్జరీ అపార్ట్మెంట్స్ తీసుకున్నారు సీతమ్మ ,రామారావుల సంతానం ఉత్తేజ్, ఉజ్వల. ఉత్తేజ్, భార్య పల్లవి,కూతురు స్రవంతి, తల్లిదండ్రులతో కలసి ఉంటున్నాడు. 

పక్క ఫ్లాట్ లో ఉజ్వల ఆమె భర్త శ్రీనివాస్ ,కొడుకు  శ్రావణ్ ఉంటారు.

స్రవంతి, శ్రావణ్, సీతమ్మ, రామారావు హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నారు.”స్రవంతి, శ్రావణ్ ఇక టీవీ చూడడం చాలు. చాలాసేపు అయింది, కాసేపు చదువుకోండి” అన్నారు రామారావు గారు. 

“తాతయ్య ఈరోజు, నానమ్మ తన చిన్నప్పటి కథలు చెబుతానన్నది.”

” సరేనర్రా, మీ అమ్మానాన్న వచ్చేసరికి తిని పడుకోండి లేకపోతే కొప్పడతారు ” అన్నారు రామారావుగారు. 

అప్పటికే సీతమ్మ భోజనాలకి రెడీ చేసి “పిల్లలతో పాటు మనం కూడా తినేద్దాము. వాళ్ళు వచ్చే సరికి ఏ అర్ధరాత్రో అవుతుంది. ఈ మధ్యన శని, ఆదివారాలు కూడా ఆఫీసు కెళుతున్నట్టు కట్టకట్టుకుని వెళ్లి రాత్రయితే గాని రావట్లేదు. వాళ్ల కొరకు ఎదురు చూస్తే, మీ ఆరోగ్యం పాడవుతుంది” అని పిల్లలకు భోజనాలు పెట్టి, తాము కూడా తిని పిల్లల రూం లోకి వచ్చారు సీతమ్మగారు. 

“ఇప్పుడు చెప్పు నానమ్మ నీ చిన్నప్పటి కథలు” అని శ్రావణ్ అంటే, 

సీతమ్మగారు చెప్పడం మొదలు పెట్టారు. “మా నాన్నగారు బాగా ఆస్తులున్న వారు, కనుక పెద్ద ఇల్లు ఉండేది. వాకిట్లో మూడు మెట్లెక్కి లోపలికి రాగానే ఒక పెద్ద హాలుండేది. దాని కుడి చేతి వైపు ఒక గది ఉండేది. మా నాన్నగారు కాగితాలు, బుక్స్ బీరువా దాంట్లో ఉండేవి. ఆయనకు పుస్తకాలు చదవడమన్నా,నాగేశ్వరావు సినిమాలు చూడడమన్నా ఎంతో ఇష్టం. ఆ కాలంలోనే ఎమెస్కో పుస్తకాల సెట్టు తెప్పించుకోవడమే కాకుండా,విశ్వనాథ గారి వేయిపడగలు, యద్దనపూడి గారి నవలలన్నీ ఇంక ఎన్నో పుస్తకాలు కొని,

మాక్కూడా చదవమని ఇచ్చేవాడు. అవి మేము ఎన్నో సార్లు చదివాము. వేయి పడగలు మాత్రం అర్ధమయ్యేది కాదు.

మా అమ్మ వాళ్ళకి పాడిపంటలు పుష్కలంగా ఉండేవి. అప్పుడు పాలు, పెరుగు అమ్మే పద్ధతి లేదు. పెరుగు, నెయ్యి, వెన్న, మజ్జిగ వాడుకోవడం, లేని వాళ్లకు పంచిపెట్టడం ఉండేది. కూరగాయలు,పండ్లు కూడా ఒకరికి ఒకరు ఇచ్చుకొనే వాళ్ళు.అంతేగాని అమ్ముకోవడం అనేది చాలా తక్కువ. 

ఇంటి వెనక వైపు పెద్ద పెరడు ఉండేది. అక్కడ ఆవులను, గేదెలను కట్టేయడానికి కర్రలు, గడ్డితో కప్పిన ఒక ‘కొట్టం’ఉండేది. దాని ప్రక్కనే మంచినీటి బావి ఉండేది. తెల్లవారుజామున 5:30 నుండి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి నీళ్ళతోడుక్కునేవాళ్ళు. అక్కడ మా అమ్మకు మంచి కాలక్షేపం. అక్కడికి వచ్చిన వాళ్ళంతా తమ కుటుంబ విషయాలు ఊరు విషయాలు చెప్పి, సలహాలు తీసుకొనేవారు. మా అమ్మ, కాలు బయట పెట్టకుండానే, ఊరి వార్తలన్ని తెలుసుకుని, కష్టసుఖాలు తెలుసుకొని, తనకు చేతనైన సాయం చేసేది.

పెరట్లో అన్ని రకాల పూల చెట్లు, మామిడి, నిమ్మ కర్వేపాకు, సపోటా మొదలైన చెట్లెన్నో ఉండేవి. చెట్లపై నున్న రకరకాల పక్షులు, కిలకిలారావాలతో మమ్మల్ని నిద్ర లేపేవి. బావి దగ్గర నీళ్లు తోడి నప్పుడు నీళ్లు వృధా కాకుండా కాలువల ద్వారా చెట్లకు వెళ్ళె ఏర్పాటు చేశారు.

సాయంకాలాలు కాఫీ తాగుతూ తోటలో ఎక్కువ సమయం గడిపే వాళ్ళం. 

వేసవి కాలమంతా మా అక్క వాళ్ళు, వాళ్ళ పిల్లలు మా కజిన్స్ వచ్చే వాళ్ళు. అందరం కలిసి ఊరికి దగ్గరలో ఉన్న మా పొలం దగ్గరకు వెళ్ళే వాళ్ళం. పొలానికి ఆనుకునే ఎప్పుడు పారే ఒక వాగుండేది. అది ఆ  ఊరికే ప్రత్యేక ఆకర్షణగా ఉండేది.

పొలంలో పండిన వేరు శనక్కాయలు, శనగ కాయలు, పని వాళ్ళు అక్కడే గడ్డి లో కాల్చి తెచ్చేవాళ్ళు. అవి తింటూ వాగు దగ్గర గంటలు గంటలు గడిపేవాళ్ళం. ఇంటికెళ్ళి తోటలోంచి తెచ్చిన తాజా కూరగాయలతో చేసిన కూరలు, పప్పు, చిక్కటి మజ్జిగతో పెరట్లో వెన్నెల్లో పిల్లలందరం కలిసి తింటుంటే ఎంత బాగుండేదో.

మా నాన్న నన్ను వేరే ఊరికి పంపడం ఇష్టం లేక మా ఊరిలోనే ఉన్నా, తన చెల్లి కొడుకు కి ఇచ్చి పెళ్లి చేసారు. కనుక నా పెళ్లి అయినా పెద్ద మార్పేమీ లేదు మా అమ్మ వాళ్లు ఎలాగో, అత్తగారిల్లు కూడా అలాగే ఉండేది.”

 ఇక మీ తాతగారు పెళ్ళైనాక కూడా మహబూబ్ నగర్ లో రూమ్ తీసుకుని బంధువుల పిల్లలతో కలిసి చదువుకునేవారు. తర్వాత హైదరాబాదులో చదువుకునేటప్పుడు నన్ను కూడా తీసుకువచ్చారు. అప్పటి నుండి ఇక్కడే మీ తాత గారి ఉద్యోగం, ఇద్దరు పిల్లల చదువులు ఉద్యోగాలు అన్ని ఇక్కడే. మీ తాతగారు రిటైర్ అయినాక ఊరికి వెళ్లి ప్రశాంత జీవితం గడుపుదామనుకున్నాము. కాని మిమ్మల్ని చూసుకునే బాధ్యత వచ్చింది. ” అని ముగించారు సీతమ్మగారు.

“అయితే తాతగారు నీకు పెళ్లికి ముందే తెలుసా? నానమ్మా” అని అడిగింది స్రవంతి. 

“ఆ తెలుసులేవే  మేన బావ నే కదా.” అన్నారు సీతమ్మ.

ఇంతట్లోకే సీతమ్మ గారి కూతురు ఉజ్వల,అల్లుడు శ్రీనివాస్, కుమారుడు ఉత్తేజ్, కోడలు పల్లవి వచ్చి, మీరు ఇంకా పడుకోలేదా? రేపే మన ఫాంహౌస్ గృహప్రవేశం అని చెప్పాము కదా! అన్ని ఏర్పాట్లు చేసి వచ్చాం. ఉదయం ఎనిమిది గంటలకు ముహూర్తం. మనం ఇంట్లో నుంచి ఐదు గంటలకు బయలుదేరాలి” అన్నారు. అందరెళ్ళి పడుకోండి” అన్నడు ఉత్తేజ్ .

రూం లోకి వెళ్ళాక భర్తతో సీతమ్మ గారు “ఈ ఫామ్ హౌస్ ఏంటండి? అడవిలో ఇల్లు ఎందుకు? హాయిగా ఊర్లో కట్టుకుంటే నలుగురితో కలిసి ఉండొచ్చు కదా! 

“ఏమో లేవే ఈ వయసులో మనం అన్ని చూస్తూ ఉండాలి. వాళ్లకు అనుకూలంగా, ఇష్టప్రకారం కట్టుకుంటారు. ఏమి కల్పించుకోవద్దు”అని నిద్రకు ఉపక్రమించారు రామారావు గారు.

ఉదయం వీళ్ళంత వెళ్లేసరికి పెద్ద ఆవరణతో కొత్త పెళ్ళికూతురులా మెరిసిపోతుంది కొత్తఇల్లు. వాకిలంతా ముగ్గులతో అలంకరించారు. చెట్లు ఎప్పుడు పెట్టారో కాని నిండా పూలతో అందంగా ఉన్నాయి. మామిడి, నిమ్మ, కరివేపాకు మొదలగు ఎన్నో మొక్కలు ఉన్నాయి. చుట్టూ పచ్చని చెట్లతో ప్రశాంతంగా ఉన్నది వాతావరణం. మేము వెళ్ళే సరికి మా అన్నయ్య, వదిన పని వాళ్ళతో పని చేయిస్తున్నారు. ఒకవైపు వంటలు అవుతున్నాయి. పురోహితుడు రమ్మనగానే,పూజ దగ్గర మా అబ్బాయి వాళ్ళు, మా అమ్మాయి వాళ్ళు వెళ్లి కూర్చుంటారు అనుకున్నాను. కానీ వాళ్ళు వచ్చి “అమ్మ, నాన్న రండి. పురోహితుడు పిలుస్తున్నారు” అన్నారు.”మేమెందుకురా మీరు కష్టపడి కట్టించారు. మీరు కూర్చోండి పూజ దగ్గర” అంటే “లేదమ్మా ఇది మీ కొరకే కట్టించాము. మీరు ఇన్నాళ్లు సిటీ  జీవితంతో విసిగిపోయారని, ఇప్పుడు మా పిల్లల బాధ్యత కూడా తీరిపోయింది. కనుక మీకెంతో ఇష్టమైన మీ ఊర్లో  మీ కొరకే కట్టించిన ఇల్లు. హాయిగా ఉండండి. మీకు ఇష్టమైన మామిడి చెట్టు దాని చుట్టూ అరుగు కూడా వేయించాం. మీరు చిన్నప్పుడు దాని దగ్గర కూర్చుని కాఫీ తాగే వాళ్ళం అన్నారు కదా! మూడేళ్ళకు ఈ చెట్టు పెద్దగవుతుంది. అప్పుడు కూడా అలాగే గడపొచ్చు. మేము శని ఆదివారాలు వచ్చి వెళుతుంటం.నీకు ఇష్టమైనప్పుడు ఫోన్ చేస్తే వెంటనే వస్తాము. లేదా మీరు వస్తామంటే  తీసుకెళ్తాము. సిటీ నుండి రెండు గంటల ప్రయాణమే కదా! ఈ ఊరు అంటే నీకు ఎంత ఇష్టమో నాకు చిన్నప్పటినుండి తెలుసు. మీ చిన్నప్పుడు ఎలా గడిపారో, అలాంటి వాతావరణాన్ని ఇక్కడ మేము మీ కొరకు సమకూర్చాము అన్నారు. తమ కోరికను భగవంతుడు పిల్లల ద్వారా తీరుస్తున్నందుకు వాళ్ళిద్దరు సంతోషంతో తమ కలలసౌధం ను చూస్తు ఆనంద భాష్పాలు రాల్చారు.

రచయిత ::  సావిత్రి కోవూరు

 

 

You May Also Like

One thought on “కలలసౌధం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!