అంశం: ప్రేమలేఖ
ఆత్మీయ అనుబంధం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: తిరుపతి కృష్ణవేణి
ప్రాణ సమానులైన చిరంజీవులకు శుభాశీస్సులు.
మీ గురించి నిత్యం మదిలో మెదిలే ఎన్నో జ్ఞాపకాలతో రాస్తున్న లేఖ.
చిన్నతనం నుండి నా చేతుల్లో పెరిగి పెద్దవారు అయ్యారు. ఎన్నోఅనుబంధాలు ఆత్మీయతలు పెనవేసుకున్న మిమ్మల్ని ఎలా మరువ గలను?
ప్రేమతో పెంచి పోషించి, కష్టసుఖాలలో మీ ఎదుగుదలకు తోడ్పడి ఎంతో ప్రేమానురాగాలు మీతో పంచుకొన్నాను.
కొన్ని పరిస్ధితుల కారణంగా మిమ్మల్ని వదిలి వెళ్ళాలసి వచ్చినందుకు ఒకింత బాధగా అనిపించినా, ఎప్పటికప్పుడు మీ క్షేమసమాచారాలు, తెలుసుకుంటూనే ఉన్నాను. మేము అక్కడ లేకపోయినా! అందరూ మేము ఉన్నట్టుగానే భావిస్తున్నారు. ఎందుకంటే? మన చుట్టు, ప్రక్కల వారికి నిత్యం మీరు చేసే సహాయము మూలంగా మేము ఉన్నట్లే అనుకుంటున్నారు.
మీరు వారికి చేసే సేవలు అంత బాగున్నాయన్నమాట! ఏ పండుగైన, పబ్బమైనా ప్రతీ ఒక్కరికీ మీ అవసరము ఉంటుంది. మొన్న సంక్రాంతికి బాగా గుర్తు కొచ్చారు. ఏది కొనాలన్నా, ఇక్కడ డబ్బుతో కూడుకున్న పని! అక్కడ ఏ అవసరము వచ్చినా ఎంచక్కా! మీ సహాయం ఎంతో ఉపయోగపడేది. మన ఒక్కరికే కాకుండా! చుట్టు ప్రక్కల వున్న ప్రతీ ఇంటికి మీ అవసరమే ఉండేది. అసలు ఉగాది పండుగ వచ్చిందంటే మిమ్మల్ని వెతుకుతూ అందరూ మన ఇంటికే వచ్చేవారు. వారికి కావాల్సిన సామాగ్రి అంతా మొత్తం మీరే సమాకూర్చేవారు.
చిరు, చేదుపూతతో, ఒకరైతే, చిరు వగరు పులుపుతో మరొకరు, సహాయ పడేవారు. పండగలు, పబ్బాలు పెళ్ళిళ్ళు, పేరంటాలు ఏవైన వస్తే ప్రతి ఇంటి ముందు తోరణాలుతో మీరు స్వాగతం పలికేవారు. తాలింపువేయాలన్నా, ఎవరికైనా వడదెబ్బ తగిలి, షర్బత్ కావాలన్నా, పరుగు, పరుగున మీ దగ్గరికి రావాల్సిందే!ఎండాకాలం వచ్చిందంటే చాలు రోడ్డున వెళ్లే ప్రతి వారు మీ దగ్గర కాస్తంత సేద తీరి హమ్మయ్య అనుకొని, గాని వెళ్లే వారు కాదు!.అసలు మీరు లేకపోతే మానవ మనుగడే లేదు.
కొందరు వారి వారి వాహనాలను మీ నీడన ఉంచాలసిందే! ఏవైనా శుభకర్యాలు వచ్చాయంటే చాలు. అందరూ మన ఇంటికే వచ్చేవారు. ఎందుకంటే? అలంకరణకు కొబ్బరి మట్టలు, ఇంటి ముందు తోరణాలకు మామిడి ఆకులు కట్టాలన్నా! కొబ్బరి బొండాలు, పూజ కొరకు పూలు, పండ్లు, ఇలా ఎన్నెన్నో వారికి కావాలసిన సామాగ్రి మొత్తం మీరే సమాకూర్చే వారు. గ్రామంలో నిర్మించుకున్న అందమైన గృహము. మా పెరటిలో స్వంత పిల్లల్లా ఎంతో ప్రేమతో నాటిన మీరు అనగా కొబ్బరి, మామిడి, సపోటా, కరివేపాకు, నిమ్మ, ఇంటిముందు నీడ కొరకు నాటిన వేప, కానుగ, మొక్కలు నేడు మహా వృక్షాలుగా మారి మాకు ఫలసహాయం అందిస్తుంటే ఆ వృక్ష సంపదను తలచుకొని మమెంతో మురిసి పోతున్నాము.
చిన్నతనం నుండి మీతో పంచుకున్న బంధాలను, అనుబంధాలను, మరిన్నో అనుభూతులను పెనవేసుకున్న మీ జ్ఞాపకాలు నిత్యం నా మదిలో మెదులుతూనే ఉంటాయి.

❤️