భయం భయం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: సావిత్రి కోవూరు
“అమ్మా, విజయ్ ని కొన్ని రోజులు మా ఊరికి తీసుకుపోతాను. వినయ్ తో కలసి ఆడుకోవడం వల్ల తండ్రి మీది బెంగ కొంచెమైన మర్చిపోయి కుదుట పడతాడు” అన్నది ఇందిర. “ఏమోనే తండ్రి పోయినప్పటి నుండి వాడు కోలుకోవడం లేదు. ఆటలన్ని మర్చిపోయాడు. తిండి సరిగ్గా తినడం లేదు. మీ అన్నయ్య ఉన్నప్పుడు వాడితోనే తిరుగుతూ, వాడితోనే ఆడుతూ, వాడు అన్నం పెడితేనే తినేవాడు. రాత్రిళ్ళు కూడ వాడి పక్కనే పడుకునేవాడు. ఆ తండ్రి కొడుకుల అనుబంధం చూడలేకనే నా కొడుకును ఆ దేవుడు ఆక్సిడెంట్ రూపంలో తీసుకుపోయాడేమొ” అని ఆక్సిడెంట్ లో నెల క్రితం చనిపోయిన మాధవ్ ను తలుచుకొని ఏడవసాగింది సుగుణమ్మ. “అమ్మా, నీవిట్లా ఏడిస్తే వదినెను, విజయ్ ని ఎవరు ఓదార్చుతారు. నాన్న ఎలా అయిపోయాడో చూడు అన్నయ్య పోయినప్పటి నుండి. ఊరుకో అమ్మా ప్లీజ్. పసివాడు విజయ్ ని చూడు. బిక్కచచ్చి పోయి ఎలా చూస్తున్నాడో. వాడి కొరకైన మీరు ధైర్యంగా ఉండాలి. వాడు ఈ వాతావరణానికి కొంచెం దూరంగా ఉంటే కుదుటపడి కొన్ని రోజులకు మామూలు మనిషౌతాడు” అన్నది ఇందిర. “మీ వదినని అడుగు. భర్త పోయి పుట్టెడు దుఃఖంలో ఉంది. కొడుకు కూడ దూరంగా వెళ్ళడం ఇష్ట పడుతుందో లేదో” అన్నది సుగుణమ్మ. “వదినా.. విజయ్ తండ్రి కొరకు చాలా దిగులు పెట్టుకొని డల్లుగా అయిపోయాడు. అమ్మ, నాన్న, నీవు మాటిమాటికి అన్నయ్యను తలుచుకుని బాధపడుతుంటే, చిన్నపిల్లవాడికి ఎలా ఉంటుంది, వాడెలా మామూలు మనిషవుతాడు చెప్పు. అందుకని కొన్ని రోజులు నా దగ్గర ఉంచుకుని కొంచెం కుదుటపడ్డాక పంపిస్తాను. అక్కడ వినయ్ తో కలిసి ఆడుకుంటాడు. దినకర్ కూడా అదే చెప్పాడు. ఏమంటావు వదినా” అన్నది ఇందిరా. “నీ ఇష్టం ఇందిరా. నీకు ఏది మంచిది అనిపిస్తే అదే చేయి. నేనేమి ఆలోచించే స్థితిలో లేను. వాడి ఆలనా పాలన చూసె స్థితిలో లేను. మీ అన్నయ్య ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదు” అంటు ఏడవటం మొదలు పెట్టింది. “ప్లీజ్ వదిన ఏడవకు” అని శ్యామలను ఓదార్చింది ఇందిర. రెండో రోజు ఇందిర భర్త దినకర్ వచ్చి ఇందిరను, వినయ్ ని, విజయ్ ని వాళ్ల ఊరికి తీసుకెళ్ళాడు విజయ్, వినయ్ తోను, వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకుంటూ, పొలం దగ్గరికి వెళ్తూ గడపసాగారు. ఇందిర వాళ్ళ నాన్న సీతారామయ్య రోజు ఫోన్ చేసి మనవళ్ళతో మాట్లాడేవారు. ఆ విధంగా నెల రోజుల్లో విజయ్ కొంచెం కుదుట పడ్డాడు. ఒకరోజు ఉదయం ఇందిర “వినయ్, విజయ్ ని తీసుకొని రా టిఫిన్ చేద్దురు. ఉదయం పాలు కూడ తాగలేదు మీరిద్దరు” అన్నది. వినయ్ వచ్చి “అమ్మా విజయ్ ఉదయం నుండి కనిపించలేదు” అన్నాడు.”వినయ్ అదేంట్రా. ఇద్దరు కలిసే ఆడుకున్నారు కద ఉదయం. వాడెక్కడికి వెళ్ళాడో నీకు తెలియదా” అన్నది ఇందిర.
“ఏమోనమ్మా, లేవగానే ఇద్దరం ఒకేసారి బ్రష్ చేసుకున్నాము. తర్వాత కొంచెం సేపటి నుండే నాకు కనిపించట్లేదు. ఇల్లంతా వెతికాను” అన్నాడు వినయ్.”అదేంట్రా నీకు తెలియకుండా ఎక్కడికెళ్తాడు. మళ్ళీ ఒకసారి అంతా వెతుకు” అన్నది ఇందిర. “ఏమైంది” అంటూ వచ్చాడు దినకర్. “ఉదయం నుండి విజయ్ కనిపించట్లేదు. టిఫిన్ పెడదామని చూస్తే ఎక్కడా లేడు. వినయ్ తో ఎక్కడికైనా వెళ్ళాడేమో అనుకున్నాను. కాని వీడు పెరట్లోనే ఉన్నాడు” అన్నది ఇందిర కంగారు పడుతు. “నీవేమి కంగారు పడకు. మేడ మీద ఉన్నాడేమో చూసొస్తానాగు” అన్నాడు దినకర్.
“లేడు నాన్న. నేను ఇందాకనే మేడ పైకి వెళ్లి చూసి వచ్చాను. పెరట్లో చూశాను. వాకిట్లో చూశాను, చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు నాన్న” అన్నాడు వినయ్. వినయ్ చెప్పిన జవాబుతో దినకర్ కు కూడ కంగారు మొదలయ్యింది. “మీ ఫ్రెండ్స్ అందరి ఇళ్ళకు వెళ్లి చూసి రా పో” అన్నాడు దినకర్. వినయ్ ఫ్రెండ్స్ అందరి ఇండ్ల కెళ్ళి విజయ్ గురించి ఎవరిని అడిగినా ఈ రోజు రాలేదనే చెప్పారు. ఇక అప్పుడు అందరికీ కంగారు ఎక్కువైంది.”ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్లాడు వీడు” అని ఇందిర ఏడవడం మొదలు పెట్టింది.
“తండ్రికి దూరమై దిగులుగా ఉన్నాడని నేను ఏదో వాడిని ఉద్ధరిస్తానని తీసుకొచ్చాను. ఓరి దేవుడా. ఈ పిల్లవాడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. వాడికి ఏదైనా ప్రమాదం జరిగితే, మా వదినకు నా ముఖం ఎలా చూపెట్టను. మా అమ్మ నాన్నలకు ఏమని సమాధానం చెప్పను” అని గట్టిగా ఏడవటం మొదలు పెట్టింది.”నీవు ఏడవకు ఇందిర. వాడు ఎక్కడికి పోడు. ఇక్కడే ఎక్కడో ఉంటాడు. ఉదయం నేను షో పీసెస్ తుడుస్తుంటే నాతో మాట్లాడాడు. ఆ తర్వాత నాకు కూడా కనిపించలేదు. ఊరంతా వెతుకుదాం ఎవరైనా కొత్త స్నేహితులు దొరికారేమో. వాళ్ళ దగ్గరికి ఏమైనా వెళ్ళాడేమో” అన్నాడు దినకర్.”వినయ్, మీరెవరెవరితో ఆడతారో ఆ ఫ్రెండ్స్ అందరిని అడిగావా” అన్నది ఇందిర. “అందర్నీ అడిగానమ్మా, అందరి ఇళ్లకు వెళ్లి చూసి వచ్చాను. ఎక్కడా లేడు” అన్నాడు వినయ్.”ఏవండీ వాడు ఈత నేర్చుకుంటానన్నాడు. మనకు చెప్పకుండా పొలంలోని బావి దగ్గరికి ఏమైనా వెళ్లాడేమో. ఒక్కసారి అక్కడ పని వాళ్ళని అడిగి చూడండి” అన్నది ఇందిర ఏడుపు గొంతుతో. దినకర్ టూవీలర్ తీసికొని పొలం దగ్గరికి వెళ్ళాడు. అక్కడున్న పని వాళ్ళని అడిగాడు విజయ్ గురించి. వాళ్ళు “ఇక్కడికి ఎవరు రాలేదు సారు”అన్నారు. చుట్టుపక్కల ఉన్న ఈత బావులన్ని వెతికాడు. మళ్ళీ ఒకసారి ఊరంతా వెతికి అందర్నీ అడుగడానికి బయలుదేరాడు దినకర్. అప్పటికి మధ్యాహ్నం 1:00 అయింది. ఇందిరకు, దినకర్ కు ఏం చేయాలో తోచట్లేదు. పిల్లవాడికి ఏమయిన ప్రమాదం జరిగిందేమో అన్న ఆలోచన వచ్చి భయంతో ఒణికిపోసాగింది ఇందిర. చివరికి తండ్రికి ఫోన్ చేసి ఏడుస్తూ జరిగిన విషయమంతా చెప్పింది ఇందిర. వెంటనే కంగారుతో వాళ్ళందరూ వచ్చేసారు. పిల్లవాడు ఎక్కడికి వెళ్లాడో ఎవరికి అర్థం కాలేదు. వాళ్ళని చూడగానే జరిగిందంతా చెప్పి మళ్ళీ ఏడవడం మొదలు పెట్టింది ఇందిర.”అసలు నేను వాడిని ఇక్కడికి తీసుకు రాకుండా ఉండాల్సింది. వాడ్ని నేను బాగు చేస్తానని, ఏదో ఉద్దరిస్తానని తీసుకొచ్చాను. కానీ వాడికి ఏం ప్రమాదం జరిగిందో ఏమో” అంటూ ఏడువ సాగింది.
“నీవెందుకు ఏడుస్తావు ఇందిర. నా రాత ఎలా ఉంటె అలాగ జరుగుతుంది. నీవేమైనా కలకన్నావా ఇలా జరుగుతుందని. ఏదో వాడి బాగు కోరి తెచ్చావు. నా దురదృష్టం కొద్ది ఇలా జరిగింది. నీవేం చేస్తావు అన్నది శ్యామల కన్నీటితో..ఇల్లంతా మళ్ళీ ఒకసారి కలియతిరిగి చూశారు. పెరట్లోకి వెళ్లి చూశారు. టైం గడిచిపోతుంది. మధ్యాహ్నం మూడైంది. ఎవరు భోజనాలు చేయలేదు. దినకర్ మళ్ళీ ఊరంతా వెతికి వచ్చాడు. కనపడ్డ వాళ్ళందరిని అడిగాడు. ఏం చేయాలో తెలియక అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. వెతికి వెతికి అలసిపోయిన వినయ్ అలాగే సోఫాలో పడుకుని నిద్రపోయాడు. సుగుణమ్మ మాత్రం వచ్చినప్పటి నుండి ఇల్లు, పెరడు, వాకిలి అణువణువు వెతుకుతూనే ఉంది కూర్చోకుండ. “మేడ మీద మంచిగ చూశారా” అంటూ సుగుణమ్మ మేడ మెట్లెక్కసాగింది. ఇందిర “వినయ్ రెండు సార్లు మేడపైకెళ్ళి చూసొచ్చాడమ్మా” అన్నది. అయినా కూడా సుగుణమ్మ మెట్లెకి మేడ పైకి వెళ్ళింది. మేడ పైన గదులు ఎన్నో రోజులుగా వాడటం లేదు. సుగుణమ్మ పైకి వెళ్లి అంగుళం అంగుళం వెతక సాగింది. అన్ని పాత సామాన్లు పనికిరాని బట్టలు. ఒక నవారు మంచం దాని పైన కూడ ఎన్నో బట్టలు కుప్పలా వేసి ఉన్నాయి. బట్టలను పక్కకు జరిపి మంచం కిందికి తొంగి చూసిన సుగుణమ్మకు కాళ్లు చేతులు దగ్గరగా ముదురుకుని పడుకున్న మనుమడు కనిపించాడు.
“ఓరి నాన్న, ఇక్కడ పడుకున్నావ్ ఏంటి రా. నా బంగారు కొండ. ఏమైంది రా నీకు. ఇక్కడెందుకు పడుకున్నావ్. ఫ్రెండ్స్ ఎవరితోనైన గొడవ పడ్డావా. నీవు కనిపించక పోతె ఎంత పరేషాన్ అవుతున్నామో తెలుసారా నాన్న. రా అంటూ జాగ్రత్తగా ముందుకు జరుపుకొని, ఎత్తుకొని, ఒళ్ళో పడుకోబెట్టుకుని ఒళ్లంతా తడుమ సాగింది. ఒళ్ళు జ్వరంతో సలసల కాలిపోతోంది. అప్పటికే సుగుణమ్మ మాటలు వినపించడంతో దినకర్, ఇందిరా, వినయ్, శ్యామల, సీతారామయ్య మేడ పైకి చేరుకున్నారు. ఒళ్లంతా కాలిపోతూ జ్వరంతో తూలిపోతున్న విజయ్ నానమ్మ మాటలతో బలవంతంగా కళ్ళు తెరిచి నాన్నమ్మను చూశాడు. నానమ్మను బిగ్గరగా పట్టుకుని ఆమె ఒళ్ళో తల పెట్టుకుని “నానమ్మా, మరేమో మామయ్యకు వాళ్ళ నాన్న ఇచ్చిన మంచి గ్లాస్ డెకరేషన్ పీస్ నేను బాల్ ఆడుకుంటుంటే తగిలి పగిలిపోయింది నానమ్మ. ఆ పాట్ అంటే మామయ్యకు చాలా ఇష్టం. మంచి గ్రీన్ రంగు పైన గోల్డెన్ పువ్వులతో ఉన్న ఆ పాట్ మామయ్యకు వాళ్ళ నాన్న రాజస్థాన్ నుండి తెచ్చి కానుకగా ఇచ్చారట. అది రోజు మామయ్య జాగ్రత్తగా తుడిచి పెట్టుకుంటారు. నేనేమో పొరపాటున బాల్ తగిలించాను. అందుకే మామయ్య కోప్పడతారేమోనని ఇక్కడికొచ్చి దాక్కున్నాను. కానీ నాకు ఎందుకో ఒళ్లంతా జ్వరం వచ్చేసింది” అన్నాడు విజయ్ ఏడుస్తూ. వెంటనే దినకర్ విజయన్ ని ఎత్తుకొని దగ్గరకు తీసుకుని “ఆఫ్ట్రాల్ ఆ పాట్ పగిలిపోతె నిన్ను కోప్పడతానా నాన్న. దానికే భయపడి ఉదయం నుండి మేడ పైన దాక్కున్నావా” అన్నాడు బాధతో. “అవును మామయ్య. ఐ యాం వెరీ సారీ. నేను కావాలని పగలగొట్టలేదు” అన్నాడు మళ్ళీ ఏడుస్తూ. “ఓరి పిచ్చి నాన్న ఆ పాట్ పగిలిందని అంత భయపడతారా ఎవరైన. అంత చిన్న విషయానికే కోప్పడతానా నేను” అంటూ కళ్ళు తుడిచాడు దినకర్. అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. బాబు క్షేమంగా ఉన్నందుకు. అసలు విషయం రోజు ఉదయం గోల్డెన్ పువ్వులు ఉన్న గ్రీన్ గ్లాస్ పాట్ దినకర్ తుడిచి షోకేస్ లో పెడుతుంటాడు. అది చూసిన విజయ్ “ఏంటి మామయ్య ఆ పాట్ ని రోజు తుడుస్తావెందుకు” అని అడిగాడు.”ఇది మా నాన్న రాజస్థాన్ నుండి తెచ్చి, నాకు ఇచ్చాడురా. అందుకే అదంటే నాకు చాలా ఇష్టం” అన్నాడు దినకర్ ఒకరోజు. ఉదయం విజయ్ ఆడుకుంటుండగా బాల్ తగిలి ఆ పాట్ కింద పడి పగిలిపోయింది. మామయ్యకి ఇష్టమైన పాట్ పగలకొట్టాననీ, కోప్పడతాడేమో, అని భయపడి పోయాడు. గబగబా ఆ పాట్ ముక్కలన్నీ ఎవరు చూడకుండ శుభ్రంగా ఏరి దూరంగా పడేసి వచ్చాడు. కాని మామయ్యకు తెలిసి ఎలాగైన కోప్పడతాడేమోనని మేడ మీద కెళ్ళి మంచం కింద దాక్కొని, బట్టలన్ళి తాను కనబడకుండ ముందుకు లాక్కుని ముసుగుతాన్ని పడుకున్నాడు. అప్పటికే కొంచెం జ్వరం ఉండడంవల్ల ఉదయం నుండి ఏమి తినకపోవడం, భయము అన్నీ కలిసి బాగా జ్వరం వచ్చి అలాగే సొమ్మసిల్లి పడుకున్నాడు. వినయ్ పైకొచ్చి చూసినా బట్టల చాటుకు పడుకోని ఉండడం వల్ల విజయ్ కనపడలేదు. సుగుణమ్మ బట్టలన్నీ జరిపి అంగుళం అంగుళం వెతకడం మొదలు పెట్టేసరికి మంచం కింద ఒళ్ళు తెలియని జ్వరంతో సొమ్మసల్లి పడి ఉన్న మనుమడు విజయ్ కనిపించాడు. ఒక్కొక్క సారి పిల్లలు చిన్న విషయాలకే భయపడి తీవ్ర నిర్ణయాలు తీసుకుని ఇంట్లో అందరిని కంగారు పెట్టేస్తారు.
