చరవాణీయం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: మక్కువ అరుణకుమారి
ఎవరు మంత్రమేసారో ఏం మాయ కమ్ముకుందో!
ఏం జరుగుతుందో అసలు!
చిన్ననాటి లీలా పాలా జూం స్టాచ్యూ ఆటలా!
జానపద చిత్రాల్లో మాయలపకీరు
మంత్రదండ లీలలా!
ఆనాడు అరక్షణమైన అడ్డుఆపు లేక
పారేటి వరదగోదారంటి
వాణిరాణిల వాగ్ధాటి చరవాణి మోజుల్లో
బూజు పట్టిందా!
జూనియర్ బాలూ నేనేనంటూ
గార్ధభ స్వరంతో గానకచేరి చేసేటి గంగరాజు
గాత్రమంతా సెల్లురింగ్ టోనుల్లో మూగబోయిందా!
పరులపై చాడీలే పరమాన్నమంటు
కడుపు నింపుకుంటూ చెవులుకొరుక్కునే
చండీ, ప్రియలు నేడు చెరొకఫోనుతో ఎడమొఖం, పెడమొఖమై చెరపట్టబడ్డారా!
ప్రియభామ నీవంటూ, జతగాడు నేనంటు
వదిలేది లేదంటూ వెనుకెనుకే తిరిగిన ఆ కన్నయ్య
కనులకింపుగా పక్కనే కూచున్న రాదమ్మను కన్నెత్తి చూడడే ఇది ఏమి చోద్యమో!
చింపిరిజుట్టు చంటిగాడి చిల్లరపనులేమయెనో!
అప్పిగాడి అమాయకపు అల్లరేమయెనో!
సుబ్బిగాడి పొట్టచెక్కలయ్యే జోకులేమయెనో!
ముప్పదేళ్ళనాటి ముచ్చట్లు లేవు
సేదదీర్చే సమీరాల పిలుపులూ లేవు
ఆత్మీయ స్పర్శల ఆచూకీ లేదు
ఆనందాశ్రువుల తడిచెమ్మ లేదు
సంతోష సమ్మేళనమా! సంతాప సమావేశమా!
నెట్టింటి యువరాణి మాయాజాలమా!
చరాచర జగత్తును చెరపట్టిన చరవాణీయమా!
